గణేశ్ ఉత్సవాల్లో షీ టీమ్స్ నిఘా.. 2,935 మంది ఆకతాయిల గుర్తింపు
ABN , Publish Date - Sep 29 , 2026 | 07:55 PM
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలను వేధించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 2,935 మంది ఆకతాయిలను గుర్తించి నిందితులకు శిక్షలు పడేలా చేశారు.
హైదరాబాద్: గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ మండపాల వద్ద షీ టీమ్స్‌ను భారీగా మోహరించి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14 నుంచి 26 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు, నిఘాలో 2,935 మంది ఆకతాయిలను షీ టీమ్స్ గుర్తించాయి. వీరిలో పలువురికి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించగా.. మరికొందరిపై కేసులు నమోదు చేసి, శిక్షలు పడేలా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉత్సవాల వేళ మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన 858 మందికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని గట్టిగా హెచ్చరించి విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించిన వారిలో 69 మందికి శిక్ష విధించినట్లు వెల్లడించారు. ఇందులో 24 మందికి రూ.1,050 జరిమానా విధించగా.. మరో 40 మందికి సామాజిక సేవతో పాటు రూ.1,050 జరిమానా విధించినట్లు తెలిపారు. మరో ఐదుగురికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించినట్లు వివరించారు. పండుగల సమయంలో యువత భక్తిశ్రద్ధలతో ఉండాలని, అంతేకానీ మహిళలను వేధించడం సరికాదని పోలీసులు పేర్కొన్నారు. అలాంటి చర్యలకు పాల్పడే ఆకతాయిలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు.. విచారణలో సంచలన విషయాలు వెల్లడి..
వివక్ష, దాడులపై దళితులు, ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలి: భట్టి విక్రమార్క..