Share News

మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు.. విచారణలో సంచలన విషయాలు వెల్లడి..

ABN , Publish Date - Sep 29 , 2026 | 07:20 PM

బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు మల్లేశ్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు.. విచారణలో సంచలన విషయాలు వెల్లడి..
Madras Regiment Arms Theft

హైదరాబాద్: బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజు (37)కి మరో ఇద్దరు సహకరించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లు వినోద్, శేషులు నిందితుడికి సహకరించినట్లు మల్కాజ్‌గిరి పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా మల్లేశ్, వినోద్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలిందన్నారు. 10 రోజుల కస్టడీలో భాగంగా మల్లేశ్‌ను పోలీసులు 8వ రోజు విచారిస్తున్నారు. ఈ మేరకు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం అతడిని మద్రాస్ రెజిమెంట్‌కు తీసుకెళ్లారు.


కాగా, బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆగస్టు 30, 31 మధ్య రాత్రి ఆయుధాల చోరీ జరిగింది. మొత్తం 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, నైట్ విజన్ బైనాక్యులర్ సహా 1,912 రౌండ్ల బుల్లెట్లను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అయితే, ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎన్‌ఐఏ, మల్కాజ్‌గిరి పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. దర్యాప్తులో మాజీ హవల్దార్ మల్లేశ్‌ను నిందితుడిగా గుర్తించారు. ఈ నెల 11న అదుపులోకి తీసుకుని అతని స్వగ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో పాతిపెట్టిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యోగం నుంచి తొలగించడంతోనే మల్లేశ్‌ చోరీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్నారు. తాజా విచారణలో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

వివక్ష, దాడులపై దళితులు, ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలి: భట్టి విక్రమార్క..

సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు కీలక నేతలతో రేవంత్‌రెడ్డి..

Updated Date - Sep 29 , 2026 | 07:24 PM