ఎడ్యుకేషన్ జిహాద్‌పై సీఎం రేవంత్ సమాధానం చెప్పాల్సిందే: రాంచందర్ రావు ఫైర్..
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:43 PM
సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 'ఎడ్యుకేషన్ జిహాద్' తారాస్థాయికి చేరిందంటూ ఆయన మండిపడ్డారు. ఇందుకు పాతబస్తీ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.
హైదరాబాద్: సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 'ఎడ్యుకేషన్ జిహాద్' తారాస్థాయికి చేరిందంటూ ఆయన మండిపడ్డారు. ఇందుకు పాతబస్తీ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఆ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్-ఫాతిహాలను చదివి రావాలని హోమ్‌వర్క్‌గా ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా 'కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస్' అని, రేవంత్ చేసిన ఓటు బ్యాంకు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల వల్లే ఇలాంటి తీవ్రవాద ఆలోచనలు ఉన్న శక్తులకు తెగింపు పెరిగిందని రాంచందర్ రావు మండిపడ్డారు. తమ బిడ్డ చేత బలవంతంగా కల్మా రాయించడాన్ని గమనించి, పాఠశాల యాజమాన్యాన్ని ధైర్యంగా నిలదీసిన ఆ చిన్నారి తల్లి సాహసాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని రాంచందర్ రావు పేర్కొన్నారు. ఇంతటి తీవ్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సదరు పాఠశాల యాజమాన్యంపై ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. కేవలం ఒక ముస్లిం టీచర్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తే సరిపోదని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత స్కూల్ మేనేజ్‌మెంట్‌దేనని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ అని రాంచందర్ రావు పేర్కొన్నారు. హిందూ విద్యార్థులు, వారి కుటుంబాల భద్రత, ఆత్మగౌరవం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కళ్లు మూసుకుని వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హిందూ విద్యార్థులపై వారి మతానికి సంబంధం లేని ప్రార్థనలు, కల్మాలు బలవంతంగా రుద్దడం ఏమాత్రం సహించబోమన్నారు. కొన్ని కాన్వెంట్ స్కూళ్లలో హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకుని రాకూడదని ఒత్తిడి చేస్తూ మతాచారాలకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యా సంస్థలు విద్యను అందించాలే తప్ప, విద్యార్థులపై ఏ మతాన్నీ రుద్దే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగ హక్కులను గౌరవించాల్సిన బాధ్యత అన్ని పాఠశాలలపై ఉందన్నారు.
ఈ 'ఎడ్యుకేషన్ జిహాద్' ఉదంతాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసారి స్పష్టం చేశారు. ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిష్పాక్షికమైన, సమగ్రమైన దర్యాప్తు జరపాలన్నారు. పాఠశాల యాజమాన్యంతో పాటు కారకులైన ప్రతి ఒక్కరిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని రాంచందర్ రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి
ఆస్తి వేలం వివాదం కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేశ్