Share News

హైదరాబాద్‌లో టీజీ సేఫ్ అధికారుల మెరుపు దాడులు.. 14 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్..

ABN , Publish Date - Oct 31 , 2026 | 09:14 PM

భాగ్యనగరంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై టీజీ సేఫ్ అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలోని 22 రెస్టారెంట్లు, ఫుడ్ సంస్థల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్‌లో టీజీ సేఫ్ అధికారుల మెరుపు దాడులు.. 14 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్..
Food Safety Violations

హైదరాబాద్: భాగ్యనగరంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలోని 22 రెస్టారెంట్లు, ఫుడ్ సంస్థల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మొత్తం 22 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టగా.. నిబంధనలు ఉల్లంఘించిన 14 రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.


వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకలు

తనిఖీల్లో పలు హోటళ్ల వంటగదుల్లో తీవ్ర అపరిశుభ్రత బయటపడింది. ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, కుళ్లిన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. కొన్ని హోటళ్లలో వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను కలిపి నిల్వ చేయడం, వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆహారం తయారు చేసే సిబ్బంది తప్పనిసరిగా ధరించాల్సిన హెయిర్ నెట్స్, గ్లౌజులు, అప్రాన్లు లేకుండానే విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మొత్తం 21 ఆహార నమూనాలను సేకరించారు. వినియోగానికి పనికిరాని, కలుషితమైన, కుళ్లిపోయిన 544 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. అలాగే 13 కిలోల వాడిన వంట నూనెను పారబోశారు. తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించిన మరో 8 హోటళ్లకు షోకాజ్ నోటీసులను టీజీ సేఫ్ అధికారులు జారీ చేశారు.


లైసెన్సులు సస్పెండ్ అయిన 14 రెస్టారెంట్లు ఇవే..

  • హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్- టోలిచౌకి

  • లక్కీ రెస్టారెంట్- సంతోష్ నగర్

  • షా ఘౌస్ కేఫ్- షాలిబండ

  • హోటల్ నయాబ్- చార్మినార్

  • శ్రీ బాలాజీ ఫ్యామిలీ దాబా- గుడిమల్కాపూర్

  • సిద్ధిఖీ కబాబ్ సెంట్రల్ కిచెన్- గుడిమల్కాపూర్

  • అల్ సబా హోటల్- టోలిచౌకి

  • మెహఫిల్ రెస్టారెంట్- దిల్‌సుఖ్‌నగర్

  • శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్- సంతోష్ నగర్

  • డైన్ హిల్ రెస్టారెంట్- మాసబ్ ట్యాంక్

  • సోహైల్ రెస్టారెంట్- మలక్‌పేట్

  • హోటల్ అక్షయ టిఫిన్స్- మలక్‌పేట్

  • హోటల్ వెంకటేశ్వర- హైదరాబాద్

  • అజీబో ది రాయల్ అరేబియన్ రెస్టారెంట్- రెతిబౌలి

ఎనిమిది హోటళ్లకు షోకాజ్ నోటీసులు

మరోవైపు, తనిఖీల్లో తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించిన తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, హోటల్ సబ్జీ, పిస్తా హౌస్, స్వీకార్ హోటల్, మండీ 36 అరేబియన్ కిచెన్, గోల్కొండ హోటల్ అండ్ రిసార్ట్స్, ఇంపీరియల్ మల్టీక్యూజిన్, తైబా బేకరీలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీజీ సేఫ్ అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. నగరంలో హోటళ్ల నిర్వహణ తీరుపై ఈ తనిఖీలు మరోసారి చర్చకు దారితీశాయి. బయటకు ఆకర్షణీయంగా కనిపించే రెస్టారెంట్ల వంటగదుల్లోనూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు..

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

Updated Date - Oct 31 , 2026 | 09:54 PM