పెళ్లైన విషయం దాచి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:03 AM
తనకు పెళ్లైన విషయాన్ని దాచి, భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మరో మహిళతో పరిచయం పెంచుకున్న ఓ సీఐ.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తొమ్మిదేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మహిళపై తొమ్మిదేళ్లుగా లైంగిక దాడి.. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి అరెస్టు
రిమాండ్‌కు తరలించిన సైదాబాద్ పోలీసులు
నేడో రేపో సస్పెండ్ చేసే అవకాశం
సైదాబాద్/ఖైరతాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తనకు పెళ్లైన విషయాన్ని దాచి, భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మరో మహిళతో పరిచయం పెంచుకున్న ఓ సీఐ.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తొమ్మిదేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ ఏదో ఒక సాకుతో దాటవేస్తుండటంతో విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నిందితుడు బాలస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ జిల్లాకు చెందిన బాధిత మహిళకు 2008లో సాయికుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. ఆమెకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగం రావడంతో వారు 2009లో హైదరాబాద్‌కు వచ్చి సైదాబాద్‌లో నివాసముంటున్నారు.
ఈ క్రమంలో 2015లో సాయికుమార్ ఓ ప్రమాదానికి గురై వెన్నుముక విరిగి మంచానికే పరిమితమయ్యాడు. విధుల్లో భాగంగా ఓ పని నిమిత్తం 2016 డిసెంబర్‌లో సదరు మహిళ చంద్రాయణగుట్ట పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ అడ్మిన్ ఎస్సైగా ఉన్న బాలస్వామి.. ఆ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ఆమెకు తరుచూ ఫోన్‌చేసి మాట్లాడటం ప్రారంభించాడు. తాను అవివాహితుడనని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అప్పుడు మంచాన పడ్డ తన భర్త గురించి బాధితురాలు చెప్పింది. ఆయన ఎక్కువ రోజులు బతకడని వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఆమె కూడా అతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొంది. తనకు దివ్యాంగురాలైన సోదరితో పాటు.. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని త్వరలోనే వాటిని పరిష్కరించుకొని పెళ్లిచేసుకుంటానని ఎస్సై బాలస్వామి షరతు పెట్టడంతో బాధిత మహిళ అందుకు అంగీకరించింది.
ఈ క్రమంలో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. బాలస్వామికి గతంలోనే పెళ్లైనట్లు బాధితురాలికి తెలిసి అతడిని నీలదీయగా.. తన భార్యతో తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని, విడిపోయి విడిగా ఉంటున్నామని, త్వరలోనే విడాకులు తీసుకుంటామని నమ్మబలికాడు. అయినా బాధితురాలు అతన్ని దూరం పెట్టడంతో ఆవేదనకు గురైన బాలస్వామి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి మళ్లీ దగ్గరయ్యాడు. 2021లో బాధితురాలి భర్త మరణించడంతో ఆమెతో సహజీవనం కొనసాగించాడు. ఆ తర్వాత 2025 జనవరి నుంచి తనను క్రమంగా దూరం పెట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితురాలు.. సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది.
ఇన్నేళ్లు తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలస్వామిని అదుపులోకి తీసుకున్నారు. డీఐ బాలస్వామి గతమంతా వివాదాస్పదమేనని శాఖలోచర్చించుకుంటున్నారు. ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయన భవానీనగర్ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ మరో మహిళతో వివాదం జరగ్గా, ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతడిని ఎస్‌హెచ్‌వో నుంచి తప్పించి ఖైరతాబాద్ డీఐగా బదిలీ వేటు వేశారు. ఇక్కడికి వచ్చిన 8 నెలల్లోనే తాజా వివాదం వెలుగులోకి వచ్చింది. బాలస్వామిని నేడో, రేపో సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
సిద్దిపేట గడ్డ నుంచే మరో ఉద్యమం
Read Latest AP News And Telangana News