Share News

‘శివ’శివా.. ఏం జరుగుతోంది?

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:53 AM

రాష్ట్రంలో ఉన్నతాధికారుల స్థాయిలో ఏం జరుగుతోంది? నిబంధనల ప్రకారం ఫైళ్లు నడుస్తున్నాయా? లేక నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారా? దొడ్డిదారుల్లో జీవోలు ఇప్పించుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

‘శివ’శివా.. ఏం జరుగుతోంది?
Shiv Balakrishna

  • రాష్ట్రంలో ఉన్నతాధికారుల స్థాయిలో నిబంధనలకు నీళ్లు!

  • అక్రమాస్తుల కేసులో సస్పెండైన శివబాలకృష్ణ కోసం తెరవెనక పక్కా ‘స్ర్కీన్‌ ప్లే’!

  • ఒకే ఫైల్‌.. చక్రం తిప్పిన ఐఏఎస్‌ అధికారులు

  • ఫైలును సీఎం పక్కనపెట్టినా గుట్టుచప్పుడు కాకుండా మెప్మా డైరెక్టర్‌గా పోస్టింగ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్నతాధికారుల స్థాయిలో ఏం జరుగుతోంది? నిబంధనల ప్రకారం ఫైళ్లు నడుస్తున్నాయా? లేక నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారా? దొడ్డిదారుల్లో జీవోలు ఇప్పించుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రూ.వందల కోట్ల అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లి, ఆపై ఈడీ ఉచ్చులో చిక్కుకున్న ఓ అవినీతి అధికారి కోసం సచివాలయం సాక్షిగా నడిచిన డ్రామా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఎండీఏ రెరా టౌన్‌ ప్లానింగ్‌ మాజీ డైరెక్ట్టర్‌ శివబాలకృష్ణ పోస్టింగ్‌ ఫైల్‌ను ఆమోదించిన తీరు సచివాలయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కథ వెనక నడిచిన డ్రామా ఏంటనే అంశం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది.


శివబాలకృష్ణ సస్పెన్షన్‌ సమయం పూర్తయిన తర్వాత ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలంటూ నిబంధనల ప్రకారం తయారైన ఒక దస్త్రాన్ని ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు. 2024లో అక్రమాస్తులతో అడ్డంగా దొరికిపోయిన బాలకృష్ణ.. జైలుకు వెళ్లి, ఆపై ఈడీ మనీ లాండరింగ్‌ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. అంతేగాక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయనపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. అతనికి పోస్టింగ్‌ ఇస్తే ప్రభుత్వంపై మచ్చ పడుతుందంటూ నిఘావర్గాల నుంచి అందిన సమాచారం మేరకు సీఎం ఆ దస్త్రాన్ని పక్కన పెట్టారు.


అక్కడితో ఈ కథ అయిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో కొందరు పెద్దలు తెరవెనక పావులు కదిపారు. మున్సిపల్‌ శాఖ కార్యదర్శిగా మరొకరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్లీ అదే ఫైల్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ, మొదటిసారి తిరస్కరణకు గురైన శివబాలకృష్ణ ఫైల్‌ కొన్ని మార్పులతో ఉన్నతాధికారి టేబుల్‌ మీదకు చేరింది. దాన్ని ముందుకు పంపడం అధికారి విధి కావడంతో అన్ని దశలూ దాటి క్లియరెన్స్‌ పొందింది. వెంటనే ఆగస్టు 4న విజిలెన్స్‌ నివేదికకు సంబంధించిన జీవో విడుదలవగా, ఆగస్టు 5న శివబాలకృష్ణ జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వడం, అదే రోజు ఆయన్ను మెప్మాలో మిషన్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ జీవో ఇవ్వడం జరిగిపోయాయి.


2024లో అక్రమాస్తుల కేసు..

శివబాలకృష్ణపై ఏసీబీ అధికారులు 2024 జనవరి 24న అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. 14 చోట్ల తనిఖీలు చే పట్టి కోట్లాది రూపాయల అక్రమాస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లోనే రూ.84లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మర్నాడే శివబాలకృష్ణను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించారు. దీంతో నాటి పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌ శివబాలకృష్ణను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జూలైలో ఈడీ అధికారులు బాలకృష్ణకు సంబంధించిన పలు ఆస్తులను అటాచ్‌ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని మాస్టర్‌ప్లాన్‌, రోడ్‌ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణపై మరో కేసు నమోదు చేశారు. అయినా ఆయన్ను మళ్లీ సర్వీసులోకి తీసుకోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీ రావణుడైతే.. కాంగ్రెస్‌ రాముడు

కేబీఆర్‌ పార్కు రోడ్డు విస్తరణకు.. హీరో బాలకృష్ణ ఇంటి స్థలం

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 04:53 AM