బీజేపీ రావణుడైతే.. కాంగ్రెస్ రాముడు
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:45 AM
భారత రాజకీయాల్లో బీజేపీని రావణాసురునిగా, కాంగ్రెస్ పార్టీని శ్రీరామునిగా సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రావణుడిని ఓడించేందుకు రామునికి మద్దతుగా నిలబడాలని గోవా ప్రజలకు పిలుపునిచ్చారు.
గోవాను డ్రగ్స్ స్టోర్‌గా మార్చిన బీజేపీ..
ఆ పార్టీని మళ్లీ నమ్మొద్దు: సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): భారత రాజకీయాల్లో బీజేపీని రావణాసురునిగా, కాంగ్రెస్ పార్టీని శ్రీరామునిగా సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రావణుడిని ఓడించేందుకు రామునికి మద్దతుగా నిలబడాలని గోవా ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీని నమ్మి గోవా ప్రజలు రెండు సార్లు మోసపోయారని, మరోసారి మోసపోవద్దని సూచన చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను ప్రాపర్టీ సావంత్ అంటూ ఎద్దేవా చేశారు. గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపును కాపాడుకోవడమే లక్ష్యంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం సెప్టెంబరు 22 నుంచి నిర్వహిస్తున్న గోయ్ రఖోన్న్ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. చీఫెన్స్ స్మారకం నుంచి కున్కోలిమ్ బస్టాండ్ వరకు సాగిన యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
ఢిల్లీలో నిరసన కార్యక్రమాల నేపథ్యంలో రాహుల్ గాంధీ గోవాకు రాలేకపోయారని, దాంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనను రాహుల్ గాంధీ ప్రతినిధిగా తనను పంపారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్‌గాంధీ దేశ ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తుంటే.. ప్రధాని మోదీ ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పటికే గోవాలో రెండు సార్లు బీజేపీని గెలిపించి మోసపోయిన ప్రజలు.. ఆ పార్టీ పాలనతో విసిగి పోయారన్నారు. ఇక్కడ మూడోసారీ బీజేపీ అధికారంలోకి వస్తే.. గోవా ప్రజలు పరాయివారిగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గోవా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ కాదు.. ప్రాపర్టీ సావంత్ అని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. ప్రమోద్ సావంత్ గోవాను అభివృద్ధి చేయకుండా ప్రజల ఆస్తులను ఇతరులకు అప్పగించే పనిలో ఉన్నారని ఆరోపించారు.
గోవాలో నిరుద్యోగిత తీవ్రంగా ఉందన్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక నిరుద్యోగ యువకులు కొందరు డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో గోవా.. ఒక డ్రగ్స్ స్టోర్‌గా మారిందన్నారు. 2023కు ముందు హైదరాబాద్ కూడా డ్రగ్స్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్‌లో కొంత భాగం గోవా నుంచి వస్తున్నట్లు గుర్తించి, ప్రత్యేక బృందాన్ని పంపగా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ క్రమంలో పలువురు నైజీరియన్లనూ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నషా ముక్త్ భారత్ అని మాట్లాడుతున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఆ పనిని గోవాలో ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కు పోలీసులతో పాటు ఈడీ, సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల మద్దతు ఉన్నప్పటికీ డ్రగ్స్ సమస్యను ఎందుకు నియంత్రించలేకపోతున్నారని నిలదీశారు.
‘‘ గోవాను డ్రగ్స్ పెడ్లర్స్ అడ్డాగా మార్చారు. ఇది గోవాకు కీర్తిని తెచ్చి పెడుతుందా.. లేక పేరు చెడగొడుతుందా?’’ అని ప్రశ్నించారు. గోవా యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దు.. గోవా పేరు చెడిపోవద్దన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే చేరుతుందన్నారు. గోవాలో డ్రగ్స్ లార్డ్స్.. ల్యాండ్ మాఫియా రాజ్యమేలాలా.? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా ? అన్నది ఇక్కడి ప్రజలు ఆలోచన చేయాలన్నారు. గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం... కాంగ్రెస్ పార్టీ కోసం కాదని, ప్రజల కోసం రావాల్సిన అవసరం ఉందన్నారు. గోవా ఎన్నికల్లో ప్రజలు హస్తం గుర్తుకు మాత్రమే ఓటు వేసి గెలిపించాలన్నారు. చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేస్తే అది బీజేపీకే లాభం చేకూరుస్తుందన్నారు.
ప్రతిపక్ష ఓట్లను చీల్చేందుకే చిన్న పార్టీలను బీజేపీ ప్రోత్సహిస్తోందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. బీజేపీకి ఐటీ, సీబీఐ, ఈడీ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుండి పని చేస్తాయని.. ఇప్పుడు వాటితో కూడా ఆ పార్టీకి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అందుకే జ్ఞానేశ్ కుమారు పేరుతో ప్రధాని మోదీ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఈసీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో నైరుతీ రుతుపవనాలు ముందుగా కేరళ, ఆ తర్వాత గోవాలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. అలాగే 2026లో కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, 2027లో గోవాలో ఏర్పాటు కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గోవా నుంచి నేరుగా ఢిల్లీ ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేబీఆర్ పార్కు రోడ్డు విస్తరణకు.. హీరో బాలకృష్ణ ఇంటి స్థలం
Read Latest AP News And Telangana News