Share News

రెండు చేతులా సంపాదన

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:39 AM

సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకులను తక్కువ ధరకే సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం.. కమీషన్ల కారణంగా మసకబారే పరిస్థితి నెలకొంది.

రెండు చేతులా సంపాదన
Telangana Hostel Tender Scam Allegations

  • కేంద్రీకృత టెండర్లతో కమీషన్ల దందా!..

  • సంక్షేమ హాస్టళ్లకు సరుకుల సరఫరాలో అవినీతి

  • పేరుకే నాకాఫ్‌కి టెండర్‌.. అన్నీ సబ్‌ కాంట్రాక్టులకే..

  • 12 మందికి సబ్‌ కాంట్రాక్టు అప్పగించిన నాకాఫ్‌

  • జిల్లాకు రూ.2 కోట్ల గుడ్‌విల్‌.. బిల్లులో 20 శాతం కమీషన్‌

  • వారి నుంచి 33 మందికి సరఫరా పనుల అప్పగింత

  • వాళ్లూ క్షేత్ర స్థాయిలో ఇతరులకు అప్పగిస్తున్న వైనం

  • ఎక్కడికక్కడ కమీషన్లతో సరుకుల్లో తగ్గుతున్న నాణ్యత

  • మొత్తం వ్యవహారంలో తెరవెనుక ఓ సీనియర్‌ ఐఏఎస్‌

  • కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల దాకా నిర్ణయం ఆయనదే

  • అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్‌ కార్యాలయం నుంచి దందా

  • ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం!

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకులను తక్కువ ధరకే సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం.. కమీషన్ల కారణంగా మసకబారే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థకు కేంద్రీకృత టెండర్‌ ద్వారా కాంట్రాక్టు అప్పగించినా.. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థ సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకుంటోంది. సబ్‌ కాంట్రాక్టు పొందిన సంస్థలు తిరిగి సబ్‌ కాంట్రాక్టులు ఇవ్వడం.. వారంతా ఎక్కడికక్కడ కమీషన్లు ఇస్తుండడంతో చివరికి హాస్టళ్లకు నాసిరకం సరుకుల సరఫరా జరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్యం ప్రశ్నార్థంగా మారే ప్రమాదం తలెత్తుతోంది.


ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఉన్నట్లు, సబ్‌ కాంట్రాక్టులు అప్పగించడం దగ్గర్నుంచి కమీషన్లు నిర్ణయించడం, వసూలు చేయడం దాకా అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలు నడిపేందుకు ఆయన తన బంధువులతో హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ ప్రైవేటు ఆఫీసును ఏర్పాటు చేయించినట్లు, అన్నీ అక్కడినుంచే కొనసాగించినట్లు తెలుస్తోంది. రా ష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, హాస్టళ్లకు2026-27 విద్యాసంవత్సరానికిగాను ఫుడ్‌ ప్రొవిజన్స్‌, క్లీనింగ్‌ మెటీరియల్స్‌ సహా 88రకాల వస్తువుల సరఫరా కోసం ప్రభు త్వం నేషనల్‌ కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా టెండర్‌ పిలిచింది.


ఇందులో సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల ఆధ్వర్యం లో నడుస్తున్న 3వేలకు పైగా రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అయితే గతం లో ఉన్న జిల్లాల వారీ టెండర్ల విధానాన్ని కాదని.. రాష్ట్రవ్యాప్తంగా కేంద్రీకృత టెండర్లు పిలిచారు. రాష్ట్ర స్థాయిలో పిలిస్తే పెద్ద కాంట్రాక్టర్లు వస్తారని, పెద్ద ఎత్తున వస్తువుల సరఫరా ఉండడంతో తక్కువ ధరకే కోట్‌ చేస్తారని ప్రభుత్వం భావించింది. కానీ, వ్యవహారమంతా అందుకు రివర్స్‌లో జరిగినట్లు తెలుస్తోంది.


నాకాఫ్ టెండర్‌.. 12 మందికి సబ్‌ కాంట్రాక్ట్‌..

రాష్ట్రవ్యాప్త టెండరును నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫార్మర్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌, ప్రాసెసింగ్‌ అండ్‌ రిటైలింగ్‌ కో ఆపరేటివ్స్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసీవోఎఫ్‌-నాకాఫ్) అనే సంస్థ రూ.800 కోట్లకు దక్కించుకుంది. అయుతే రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లకు సరుకులను సరఫరా చేయాల్సిన ఈ సంస్థ.. ఆ పని చేయకుండా 12 మంది కాంట్రాక్టర్లకు సబ్‌ కాంట్రాక్టు ఇచ్చింది. అయితే ఆ 12 మంది కాంట్రాక్టర్లు కూడా సరుకులు సరఫరా చేయకుండా మళ్లీ 33 మందికి.. అంటే జిల్లాకు ఒకరికి చొప్పున సబ్‌లో సబ్‌ కాంట్రాక్టు ఇచ్చారు. వీరిలోనూ కొందరు మాత్రమే సరుకులు సరఫరా చేస్తున్నారు. మరికొందరు ఇంకొంత మందికి క్షేత్రస్థాయిలో సబ్‌ కాంట్రాక్టు ఇచ్చేశారు. మొత్తానికి కేంద్రీకృతం అన్నది మూడంచెలుగా, కొన్నిచోట్ల నాలుగంచెలుగా మారిపోయింది.


అంచెలంచెలుగా ఎక్కడికక్కడ ఎవరి మార్జిన్‌లు వారు పంచుకుంటున్నారు. అది కూడా ఒక్కో అంచెలో చేతులు మారుతున్న మొత్తాలు, మార్జిన్లు కళ్లు తిరిగే స్థాయిలో ఉంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత టెండర్‌ దక్కించుకున్న నాకాఫ్‌ సంస్థ.. వాటిని సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చేందుకు జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున గుడ్‌విల్‌, బిల్లులో 20 శాతం కమిషన్‌ ఇవ్వాలనే షరతుతో కట్టబెట్టింది. దీనిని తీసుకున్నవారు తమ లాభం తాము చూసుకొని మళ్లీ జిల్లాల వారీగా సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో మళ్లీ కోత.. మళ్లీ సబ్‌ కాంట్రాక్టు.. వెరసి బడ్జెట్‌ బక్కచిక్కింది. సరఫరా చేసే వస్తువులు నాసిరకమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.


బ్లాక్‌లిస్టులో ఉన్న సంస్థకు రెడ్‌ కార్పెట్‌..!

కేంద్రీకృత టెండర్‌ను దక్కించుకున్న నాకాఫ్‌ సంస్థ.. తెలంగాణలోనే కాకుండా పలు ఇతర రాష్ట్రాల్లోనూ బ్లాక్‌లిస్టులో ఉంది. 2022-23 రబీ సీజన్‌కు సంబంఽధించి వేలంలో దక్కించుకున్న ధాన్యాన్ని తీసుకెళ్లకపోవడంతో రూ.65 కోట్ల డిపాజిట్‌ మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ఆహార సరఫరా, ఇతర టెండర్ల ప్రక్రియల వివాదాల నేపథ్యంలో తెలంగాణ మార్క్‌ఫెడ్‌ ఈ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం. మరోవైపు జార్ఖండ్‌లో 2017లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు ఆలస్యం చేశారనే ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నాకాఫ్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఇక ఒడిసాలో మదర్‌ అండ్‌ బేబీ కిట్ల సరఫరాలో లోపాల కా రణంగా ఆ రాష్ట్ర మెడికల్‌ కార్పొరేషన్‌ నాకా్‌ఫను మూడేళ్లపాటు బ్లాక్‌లిస్ట్‌ చేసింది. మొత్తంగా.. నిబంధనల ఉల్లంఘనలు, సరఫరా లోపాల ఆరోపణలపై వేర్వేరు సమయాల్లో వివిధ రాష్ట్రాలో దీనిని బ్లాక్‌లి్‌స్ట లో పెట్టారు. ఇలాంటి అభాసుపాలైన సంస్థకు వందల కోట్ల విలువైన నిత్యావసరాల టెండర్లు ఆ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వల్లే దక్కినట్లు సమాచారం.


సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో దందా ఇలా..

కేంద్రీకృత టెండర్‌ నిబంధనల ప్రకారం ఈ కాంట్రా క్టు.. ఎటువంటి జోన్‌-వైజ్‌, లాట్‌-వైజ్‌ లేదా ఐటమ్‌- వైజ్‌ విభజన లేని సింగిల్‌ హోల్‌-బాస్కెట్‌ కాంట్రాక్ట్‌. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలకు కలిపి ఒకే ప్రైమరీ సప్లయర్‌ (ఎల్‌1 బిడ్డర్‌) మాత్రమే మొ త్తం 88 రకాల సరుకులు సరఫరా చేయాలి. బ్రాండెడ్‌ (కేటగిరి ఏ), డీసీఏ ఇండెక్స్‌ (కేటగిరి-బీ), ఫిక్స్‌డ్‌ (కేటగిరి-సీ)గా వర్గీకరించిన ఈ సరుకులను రాష్ట్రంలోని 33 జిల్లాలకు మూడు జోన్ల వారీగా రవాణా చేసి, నేరుగా ఆయా సంస్థలకు డోర్‌ డెలివరీ చేయాల్సి ఉంటుంది. టెండర్‌ దక్కించుకున్న ప్రధాన సంస్థే సొంత గోడౌన్లు, రవాణా వాహనాలు, బలమైన యంత్రాంగంతో ఈ బాధ్యతను నిర్వర్తించాలి. ఇతరులకు బదిలీ చేయడానికి, సబ్‌ కాంట్రాక్టు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. కానీ, సెప్టెంబరు 1 నుంచి సరుకులు సరఫరా చేయాల్సి ఉన్నా ఆ సంస్థ ముంద స్తు పథకం ప్రకారం చేతులెత్తేసింది.


ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 12 మంది చానెల్‌/సబ్‌ కాంట్రాక్లకు ఈ బాధ్యత కట్టబెట్టింది. ఈ సబ్‌ కాంట్రాక్టర్లు మళ్లీ దానిని మరింత కింది స్థాయికి తీసుకెళ్లి, జిల్లాకొకరి చొప్పున 33 మంది కాంట్రాక్టర్లను రంగంలోకి దించారు. జోగులాంబ గద్వాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు ప్రతి జిల్లాలోనూ వేర్వేరు ఫర్మ్‌లు, వ్యక్తులు ఈ సరఫరా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరెవరికీ గతంలో హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసిన అనుభవం కూడా లేదు. విచిత్రంగా కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ రైస్‌ మిల్లు వ్యాపారి ఏకంగా ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సరఫరా చేస్తానని సబ్‌ కాంట్రాక్టుకు తీసుకుని.. రంగారెడ్డి, హైదరాబాద్‌, రాజ న్న సిరిసిల్ల, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల కాంట్రాక్టును ఓ ఇండస్ట్రీకి ఇచ్చారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, ఖమ్మం జిల్లాలకు సరఫరా బాధ్యతలను మరో సంస్థకు సబ్‌ కాంట్రాక్టు ఇచ్చారు.


ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు కలిపి నాకాఫ్‌ వద్ద కాంట్రాక్టు తీసుకున్న సబ్‌కాంట్రాక్టర్‌ సరఫరా చేతులెత్తేసి.. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు కలిపి ఒక ట్రేడర్‌కు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. దీంతోపాటు వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలకు ఓ ఏజెన్సీకి, నిజామాబాద్‌ జిల్లాలో సరఫరాకు మరో ఇండస్ర్టీకి అప్పగించారు. కాగా, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల జిల్లాలకు కలిపి కాంట్రాక్ట్‌ తీసుకున్న సబ్‌ కాంట్రాక్టరే.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు ఓ డీలర్‌కు, మంచిర్యాల, జగిత్యాలకు మరో ట్రేడర్‌కు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అసలు కాంట్రాక్టర్‌ దగ్గర కాంట్రాక్టుకు తీసుకుని.. మళ్లీ వాళ్లు వేరొకరికి ఇచ్చేసుకున్నారు. టెండర్‌ నిబంధనల ప్రకా రం.. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ప్రమాణాలు, ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌ పరీక్షలు, కచ్చితమైన బార్‌ కోడింగ్‌, 60ు షెల్ప్‌లైఫ్‌ వంటి నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి.


రూ.కోట్ల కొద్దీ గుడ్‌విల్‌..

సరుకుల సరఫరాకు కాంట్రాక్టు తీసుకున్న సబ్‌ కాంట్రాక్టర్లు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.66 కోట్లు గుడ్‌విల్‌గా, సరఫరా చేసే వస్తువుల విలువలో 20 శాతం చొప్పున ఇచ్చేందుకు నాకాఫ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకోసమే ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ధరల కంటే దాదాపు 35 శాతానికిపైగా టెండర్‌ రేట్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో సబ్‌ కాంట్రాక్టర్లు గుడ్‌విల్‌, కమీషన్లు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో పోటీపడ్డట్లు సమాచారం. నాకా్‌ఫకు చెందిన కాంట్రాక్టర్‌.. ఆ 12 మంది సబ్‌ కాంట్రాక్టర్లకు మధ్యవర్తిత్వం వహించింది మాత్రం ఆ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. సబ్‌ కాంట్రాక్టుకు తావులేకపోయినా ఆయనే చక్రం తిప్పారనే విమర్శలున్నాయి. ఈ అక్రమ దందాకు హైదరాబాద్‌ అమీర్‌పేటలో సదరు అధికారి బంధువులకు చెందిన ఓ కంపెనీ కార్యాలయమే అడ్డాగా మారిందని సమాచారం.


అధికారిని మందలించిన మంత్రి!

వాస్తవానికి నాకాఫ్‌ సంస్థ సెప్టెంబరు నుంచి హాస్టళ్లకు సరుకులు సరఫరా చేయాల్సి ఉన్నా.. నెల రోజులపాటు ప్రారంభించలేదు. అయినా ఆ సంస్థపై చర్యలు తీసుకోలేకపోయారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి సబ్‌ కాంట్రాక్టర్లు సరఫరా మొదలు పెట్టినప్పటికీ.. వాటిలో నాణ్యత లేదని, నిర్ణయించిన సరుకులు రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం సచివాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గురుకులాల ప్రిన్సిపాళ్లంతా.. ఇదే విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. నాణ్యతలేని సరుకులు తెస్తూ.. వాటిని తీసుకోకపోతే కొందరు అధికారులే తమను బెదిరిస్తున్నారంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖ మంత్రి సైతం ఇటీవల ఆ అధికారిని మందలించినట్లు సమాచారం. ‘తమాషానా? ఇదంతా నీ వల్లే వస్తుంది’ అని ఆ అధికారిపై ఆగ్రహం వక్తం చేసినట్లు తెలిసింది.


అయినా.. ఆ ఐఏఎస్‌ అధికారి మంత్రులతో సైతం వాగ్వాదానికి దిగడం.. సంక్షేమశాఖ మంత్రులకు సైతం తలనొప్పిగా మారిందని, ఈ విషయాన్ని వారు తమ సన్నిహిత మంత్రుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. చక్రం తిప్పిన ఆ అధికారికి, కాంట్రాక్టర్లకు మధ్య పరిచయం పెరిగి.. ఇప్పుడు వారు నేరుగా ఆయననే ఫోన్ల ద్వారా సంప్రదిస్తున్నట్లు, చాలా మంది ఏకంగా సచివాలయానికే క్యూ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పేద పిల్లల భవ్యిత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ఈ బడా అధికారి వ్యవహారంపై ఉన్నత స్థాయి విజిలెన్స్‌ విచారణ జరిపితే అసలునిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్‌!

కేబీఆర్‌ పార్కు రోడ్డు విస్తరణకు.. హీరో బాలకృష్ణ ఇంటి స్థలం
Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 04:47 AM