అండాల అక్రమ సేకరణ కేసు దర్యాప్తు ముమ్మరం
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:46 AM
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని బేగంపేటలో తొలుత వెలుగులోకి వచ్చిన అండాల అక్రమ సేకరణ దందా వెనుక బలమైన నెట్‌వర్క్ ఉన్నట్టు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.
మూడు కమిషనరేట్లకు విస్తరించిన నెట్‌వర్క్
సమన్వయంతో కేసుల దర్యాప్తుకు సీపీల నిర్ణయం
హైదరాబాద్, చాదర్‌ఘాట్, హైదరాబాద్ సిటీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని బేగంపేటలో తొలుత వెలుగులోకి వచ్చిన అండాల అక్రమ సేకరణ దందా వెనుక బలమైన నెట్‌వర్క్ ఉన్నట్టు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. మల్కాజిగిరి సీపీ సుమతి ఆధ్వర్యంలోని బృందాలు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేశాయి. ఈ క్రమంలో సరూర్‌నగర్, మలక్‌పేట, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మహాంకాళీ, మియాపూర్ పోలీసు స్టేషన్ల పరిధిలో అండాల సేకరణ, ఫెర్టిలిటీ కేంద్రాలు, ఏజంట్లపై మెత్తం 9 కేసులు నమోదయ్యాయి.
దీంతో ఈ నెట్‌వర్క్ ఊహించిన దానికంటే ఎక్కువ విస్తరించి ఉండడంతో.. హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ సీపీలు మహేష్ భగవత్, సుమతి, రమేష్ ఈ కేసుల దర్యాప్తును సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ ముఠా ఆట కట్టించేందుకు ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులకు నిందితులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, డిజిటల్ లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ముఠాతో సంబంధం పెట్టుకొని ప్రస్తుతం పరారీలో ఉన్న వైద్యులు, ఐవీఎఫ్ సెంటర్ల నిర్వాహకుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
66 మంది మహిళల నుంచి సేకరించిన అండాలను గచ్చిబౌలి, ఉప్పల్, టోలీచౌకీల్లోని ఐవీఎఫ్ క్లినిక్‌లకు సరఫరా చేసినట్టు గుర్తించిన పోలీసులు.. ఇందుకు సంబంధించిన రికార్డులను కనుగొనడంపై దృష్టిపెట్టారు. కాగా, ఈ కేసుల్లో అరెస్టయిన సద్గురు హెల్త్ కేర్ బ్రాంచ్ ఇన్‌ఛార్జి ఆనంద్ రాజ్, అడ్మిన్ సుభానీ షేక్‌లను ఐదు రోజుల కస్టడీకి కోరుతూ మలక్‌పేట పోలీసులు పిటిషన్ వేశారు. అలాగే, ఈ కేసులో అరెస్టయి, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితులు అమిత్‌శర్మ, నిఖిత్ పర్వీన్, దుర్గా ప్రసాద్‌లపై మలక్‌పేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నిందితుల పీటీ వారెంట్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో సమర్పించారు. నకిలీ పత్రాలు సృష్టించిన ప్రవీణ్‌ను కూడా మరోసారి కస్టడీకి తీసుకోవాలని అనుకుంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..