గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు: సీఎం రేవంత్ ఆదేశం..
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:25 PM
భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పండుగ వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలపై శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పండుగ వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సహాయ సహకారాలు అందించాలన్నారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలపై శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలి. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుంది. మీ సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా నేనే సమీక్ష నిర్వహిస్తున్నా. నిర్వాహకులు మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే ఆ వివరాలను స్థానిక కమిషనరేట్‌కు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఊహించని పరిణామాలు జరిగినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుంది.
నగరంలో అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువుల వద్ద చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీసు శాఖలు నిరంతర పర్యవేక్షణ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పండుగ వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలి. సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది' అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైంగిక వేధింపుల కేసు.. డీ-10 డ్యాన్స్ షో విజేత రాజు అరెస్టు..
హైదరాబాద్ డెవలప్‌మెంట్‌పై సమావేశం ఏర్పాటు చేయండి: సీఎంకు రాజాసింగ్ విజ్ఞప్తి