Hyderabad: హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి 10 గంటల నుంచి ఫ్లైఓవర్ల మూసివేత
ABN , Publish Date - Jan 16 , 2026 | 06:26 PM
హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి పది గంటల నుంచి దాదాపు అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. నగర వాసులు ఈ విషయాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలన్నారు.
హైదరాబాద్, జనవరి 16: ఇవాళ ముస్లింల పవిత్ర దినమైన షబ్-ఈ-మేరజ్(జగ్‌నే కి రాత్) దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని పలు ప్రధాన ఫ్లైఓవర్లు మూసి వేస్తున్నారు. నేడు(జనవరి 16) రాత్రి 10 గంటల నుంచి ఫ్లైఓవర్లను మూసి వేయనున్నారు. జనవరి 16, 17 తేదీలలో జరిగే షబ్-ఈ-మేరజ్ పండుగ దృష్ట్యా.. గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రేస్‌వే.. ఇంకా లంగర్ హౌస్ ఫ్లైఓవర్‌లు మినహా హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్‌లు మూసివేస్తారు.
ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ డేవిస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, రోడ్డు భద్రతా ప్రమాణాల కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. నగరంలోని నెక్లెస్ రోడ్ సహా చాలా ఫ్లైఓవర్‌లను మూసివేస్తామని తెలిపారు. వాటితో పాటు అవసరమైతే తెలంగాణ తల్లి, షేక్‌పేట్, మన్మోహన్ సింగ్, బహదూర్‌పురా ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్లనూ బంద్ చేస్తామని చెప్పారు.
సోషల్ మీడియా మాధ్యమాలైన X, Facebook ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తాజా ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవాలని నగర పోలీసులు.. ప్రయాణికులను కోరారు. ఏదైనా అత్యవసర ప్రయాణం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ద్వారా నివేదించవచ్చని వెల్లడించారు. నగర పౌరులు తాజా అప్‌డేట్స్, ట్రాఫిక్ మళ్లింపులను గమనించి, గమ్య స్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని పోలీసులు కోరారు.
కాగా.. స్థానికంగా జగ్‌నే కి రాత్ అని కూడా పిలిచే షబ్-ఈ-మేరజ్, ఇస్లామిక్ నెల రజబ్ 27వ రోజున జరుపుకుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి జెరూసలేం(ఇజ్రా)కు రాత్రి ప్రయాణించి.. ఆ తరువాత స్వర్గం(మెరాజ్) చేరుకున్నారని ఇస్లాం మతస్తులు నమ్ముతారు. అందుకనే ఈ రోజు రాత్రి జాగారం చేస్తారు. ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ సందర్భంగా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు.
ఇవీ చదవండి:
30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?
వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య