Elon Musk - Medical Schools: వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:29 PM
వైద్య రంగంలో ఏఐ ప్రభావంపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తాజాగా కీలక కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో వైద్య కళాశాలల అవసరం ఉండదని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మానవ సమాజాన్ని కృత్రిమ మేధ సమూలంగా మార్చనుందన్న అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి రంగంలో ఏఐదే ఆధిపత్యమని అనేక మంది ప్రముఖులు చెబుతున్నారు. వైద్య రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏఐ వేళ్లూనుకున్నాక వైద్య కళాశాలల అవసరం ఉండదని కామెంట్ చేశారు (Musk Says Medical Schools Will Become Irrelevant).
ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పీటర్ హెచ్. డయామెండిస్ నిర్వహించిన ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్‌లో ఎలాన్ మస్క్ తాజాగా పాల్గొన్నారు. ఇందులో వైద్య రంగం భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐతో వైద్య రంగ ముఖచిత్రం సమూలంగా మారిపోతుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యున్నత వైద్య సేవలు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయని జోస్యం చెప్పారు. దీనికి డయామెండిస్ స్పందిస్తూ.. ‘అంటే వైద్య కళాశాలలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉండదని అంటున్నారా?’ అని ప్రశ్నించారు. దీనికి మస్క్ అవునని తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. ఆ మాటకొస్తే ఏరకమైన వ్యవస్థాగత విద్యా విధానం అవసరం ఉండదని కూడా కుండబద్దలు కొట్టారు.
ఈ కామెంట్స్‌పై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది మస్క్ అభిప్రాయంతో ఏకీభవించారు. ‘ఈ చేదు నిజాన్ని ఎవరూ అంగీకరించే స్థితిలో లేరు. కానీ ఇది వాస్తవం. భవిష్యత్తులో అత్యాధునిక మెడికల్ కేర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. వైద్య కళాశాలలకు వెళ్లి చదవడం నిరర్థకంగా మారుతుంది’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
ఏఐపై మస్క్ గతంలో కూడా ఇలాంటి పలు అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఏఐ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలకు పనిచేయాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ సార్వత్రిక కనీస ఆదాయం అందుతుందని, పని చేయడం అనేది ఐచ్ఛిక అంశంగా మారుతుందని కూడా జోస్యం చెప్పారు.
ఇవీ చదవండి:
మహీంద్రా థార్ కారు నడుపుతూ సంచలన కామెంట్.. నెట్టింట వెల్లువెత్తుతున్న ఆగ్రహం
ప్రధాని మోదీకి లేఖ! ఆయన రిప్లై చూశాక..