Fast Charging: 30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:33 PM
ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉన్న ఫోన్ కొనుగోలు చేస్తున్నారా? ఇలాంటి ఫోన్‌లను కొనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో స్మార్ట్ ఫోన్‌లు అన్నీ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తున్నాయి. 30 వాట్స్, 60 వాట్స్‌తో పాటు కొన్ని 90 వాట్స్ చార్జర్లకూ అనుకూలంగా ఉంటున్నాయి. అధిక వాటేజ్ ఉన్న చార్జర్ బెటర్ అని కొందరు అంటారు. కొందరు మాత్రం తక్కువ వాటేజీ ఇచ్చే చార్జర్ సేఫ్ అని నమ్ముతారు.
ఏమిటీ వాటేజ్?
చార్జర్ ఎంత శక్తిని అందిస్తుందనేది దాని వాటేజ్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే 90 వాట్స్ చార్జర్, 30 వాట్స్ చార్జర్ కంటే మూడు రెట్ల పవర్ అందిస్తుంది. అధిక వాటేజ్ ఉన్న చార్జర్‌తో ఫోన్ మరింత వేగంగా చార్జ్ అవుతుంది. అయితే, ఫోన్ తయారీదారులు సూచించిన చార్జర్‌లను మాత్రమే కస్టమర్లు వాడాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఫాలో కావాల్సిన రూల్.
సాధారణ ఫోన్‌లల్లో చాలా వాటిని 30 వాట్స్ చార్జర్‌తో చార్జ్ చేసుకోవచ్చు. వీటితో చార్జింగ్ సమయంలో ఫోన్ ఎక్కువగా వేడెక్కదు. ఫోన్ కూడా ఓ మోస్తరు వేగంతో చార్జ్ అవుతుంది. అయితే, 90 వాట్స్ చార్జర్‌కు అనుగుణంగా డిజైన్ చేసిన ప్రీమియం ఫోన్స్‌ను కూడా తయారీదార్లు అందుబాటులోకి తెచ్చారు. ఇలాంటి ఫోన్‌లకు 90 వాట్స్ చార్జర్‌ను వినియోగిస్తే కేవలం 15 నిమిషాల్లోనే బ్యాటరీ చార్జింగ్ 50 శాతానికి వస్తుంది. ఇక మీ ఫోన్‌ను 30 వాట్స్ చార్జర్‌ను సపోర్టు చేసేదే అయితే 90 వాట్స్ చార్జర్‌ను వినియోగించకూడదు.
అధిక వాటేజ్ ఉన్న చార్జర్లతో బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని కూడా కొందరు వినియోగదారులు భయపడుతుంటారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, అధిక వాటేజీ చార్జర్ వాడినప్పుడు చార్జింగ్ మొదట్లో ఫోన్ వేడెక్కుతుంది. పదే పదే ఇలా జరిగితే బ్యాటరీ పని తీరు దెబ్బతింటుంది. కానీ, ఇలాంటి చార్జర్స్‌ను సపోర్టు చేసే ఫోన్‌ల డిజైన్ ప్రత్యేకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక పవర్ తీసుకుంటున్నా వేడి మాత్రం అదుపు తప్పకుండా ఉండేలా బ్యాటరీలను డిజైన్ చేస్తారని వివరిస్తున్నారు. చాలా ఫోన్‌లల్లో బ్యాటరీ పవర్ 80 శాతానికి రాగానే చార్జింగ్ నిలిచిపోయే ఫీచర్ అందుబాటులో ఉంది.
ఇవీ చదవండి
వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య
వరుసపెట్టి ఈమెయిల్స్‌తో యూజర్లలో టెన్షన్.. వర్రీ వద్దన్న ఇన్‌స్టాగ్రామ్