Insta Password Reset Mails: వరుసపెట్టి ఈమెయిల్స్‌తో యూజర్లలో టెన్షన్.. వర్రీ వద్దన్న ఇన్‌స్టాగ్రామ్
ABN , Publish Date - Jan 11 , 2026 | 06:17 PM
ఇన్‌స్టా యూజర్లకు వరుసపెట్టి పాస్‌వర్డ్స్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లడంతో అంతా కంగారు పడ్డారు. పలు దేశాల్లోని వారికి ఈ అనుభవం ఎదురుకావడంతో నెట్టింట కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా నెట్టింట వివరణ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవాలంటూ పలు దేశాల్లో ఇన్‌స్టా యూజర్లకు వరుసపెట్టి ఈమెయిల్స్ వెళ్లడంతో కలకలం రేగింది. ఆన్‌లైన్‌లో పలువురు ఈ విషయాన్ని పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇలా జరుగుతోందని కొందరు చెప్పుకొచ్చారు. తమ డేటా భద్రతకు ముప్పు ఉందా? అంటూ నెట్టింట సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఇన్‌స్టాగ్రామ్.. టెన్షన్ వద్దని యూజర్లకు భరోసా ఇచ్చింది (Insta Password Reset Emails).
అసలేం జరిగిందంటే..
గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లోని యూజర్లకు వరుసపెట్టి పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లాయి. యూజర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవాలనేది వాటి సారాంశం. దీంతో కలకలం రేగడంతో అనేక మంది తమ అనుభవాలను నెట్టింట పంచుకున్నారు. అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఇలా కలకలం రేగుతున్న తరుణంలోనే కొన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థలు కూడా వినియోగదారులను శుక్రవారం అలర్ట్ చేశాయి. మిలియన్‌ల కొద్దీ ఇన్‌స్టా యూజర్ల డేటా భద్రతకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించాయి. ప్రపంచవ్యాప్తంగా 17.5 మిలియన్ ఇన్‌స్టా అకౌంట్స్ చిక్కుల్లో పడ్డాయని తెలిపాయి. బయటకు పొక్కిన డేటాలో యూజర్ల అకౌంట్ పేర్లు, ఫిజికల్ అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు లీక్ అయ్యి ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ సమాచారమంతా డార్క్‌లో విక్రయానికి పెట్టారన్న వార్త కూడా కలకలానికి దారి తీసింది.
అయితే, ఇన్‌స్టా మాత్రం ఈ వార్తలను ఖండించింది. తమ యూజర్ల డేటాకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసింది. అంతా సవ్యంగానే ఉందని వివరణ ఇచ్చింది. ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. చిన్న సాంకేతిక లోపం కారణంగా యూజర్లకు పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లాయని ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్ వేదికగా తెలిపింది. డేటా భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని తెలిపింది. తమ వ్యవస్థలు, అకౌంట్స్ అన్నీ భద్రంగా ఉన్నాయని భరోసా ఇచ్చింది. ఈ సాంకేతిక లోపాన్ని సరిదిద్దామని, అనవసర తికమక కలిగించినందుకు క్షమాపణ చెబుతున్నామంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
ఇవీ చదవండి:
ఈ ఫీచర్ వాడితే మొబైల్ నెట్‌వర్క్ లేకున్నా ఫోన్ కాల్స్!
వాట్సాప్ గ్రూప్ చాట్స్ ఇక మరింత మెరుగు.. అద్భుతమైన కొత్త ఫీచర్స్