WhatsApp New Features: వాట్సాప్ గ్రూప్ చాట్స్ ఇక మరింత మెరుగు.. అద్భుతమైన కొత్త ఫీచర్స్
ABN , Publish Date - Jan 09 , 2026 | 07:11 PM
గ్రూప్ చాట్స్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. మరి అవేంటో, ఎలా వినియోగించాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ గ్రూప్ చాట్ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ రకాల కార్యక్రమాల ప్లానింగ్‌పై చర్చించుకుని అమలు పరిచేందుకు ఇది అద్భుతమైన వేదిక. అయితే, గ్రూప్ చాట్స్‌లో యూజర్లను చికాకు పెట్టే పలు సమస్యలకు చెక్ పెట్టేలా వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం (Whatsapp Group Chat New Features).
మెంబర్ ట్యాగ్స్
ఈసారి వాట్సాప్ విడుదల చేసిన అప్‌డేట్స్‌లో మెంబర్ ట్యాగ్స్ (Member Tags) ఫీచర్ అతి పెద్దదని చెప్పకతప్పదు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వివిధ గ్రూప్ చాట్స్‌లో తమ పేర్లకు ప్రత్యేక లేబుల్స్‌ను సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రెసిడెంట్ అసోసియేషన్‌కు మీరు సెక్రెటరీ అయితే అసోసియేషన్‌కు సంబంధించిన గ్రూప్ చాట్‌లో మీ పేరుకు లేబుల్‌ను సెక్రెటరీగా సెట్ చేసుకోవచ్చు. దీంతో, మీరు చాట్ గ్రూప్‌లో సెక్రెటరీగా కనిపిస్తారు. అంతేకాకుండా, ఈ లేబుల్ సంబంధిత వాట్సాప్ గ్రూప్‌కే పరిమితం. అంటే.. మరో గ్రూప్‌లో ఈ లేబుల్ కనిపించదు. కావాలనుకుంటే మీరు రెండో గ్రూప్‌లో మీకు కావాల్సిన మరో లేబుల్‌ను సెట్ చేసుకోవచ్చు. త్వరలో ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
టెక్స్ట్ స్టిక్కర్స్
ఇక గ్రూప్ చాటింగ్‌లో యూజర్లు మరింత మెరుగ్గా తమ భావాలను వ్యక్తీకరించేందుకు టెక్స్ట్ స్టిక్కర్ ఫీచర్‌ను (Text Stickers) కూడా ప్రవేశపెట్టామని వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తాము రాయాలనుకున్న పదాలను స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం స్టిక్కర్ సెర్చ్ బార్‌లో ఆ పదాన్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే కావాల్సిన స్టిక్కర్ ప్రత్యక్షమవుతుంది. వీటిని పోస్టు చేయకుండానే స్టిక్కర్ ప్యాక్‌లో ప్రత్యేకంగా సేవ్ చేసుకోవచ్చు. దీంతో, అవసరమైనప్పుడు స్టిక్కర్ ప్యాక్‌లోని టెక్స్ట్ స్టిక్కర్‌లను వాడుకోవచ్చు. ప్రతిసారీ ఎమోజీలు, జీఐఎఫ్‌లపైనే ఆధారపడే అగత్యం తప్పుతుంది. మరింత క్రియేటివ్‌గా యూజర్లు తమని తాము వ్యక్తీకరించుకునే వీలు చిక్కుతుంది.
ఇవీ చదవండి:
ఈ ఫీచర్ వాడితే మొబైల్ నెట్‌వర్క్ లేకున్నా ఫోన్ కాల్స్!
9000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.. 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్..