Wi Fi Calling: ఈ ఫీచర్ వాడితే మొబైల్ నెట్‌వర్క్ లేకున్నా ఫోన్ కాల్స్!
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:55 PM
మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేని ప్రాంతాల్లో ఫోన్స్ చేసుకునేందుకు అక్కరకు వచ్చేదే వైఫై కాలింగ్ ఫీచర్. మరి ఈ ఫీచర్‌ను ఎలా వినియోగించుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కోసారి మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉండదు. అలాంటి సందర్భాల్లో కాల్ డ్రాప్ కావడం లేదా అసలు కాల్ కలవకపోవడం వంటి సమస్యలు వేధిస్తాయి. వీటి నుంచి గట్టెక్కేందుకు వైఫై కాలింగ్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారత్‌లోని ప్రధాన టెలికం ఆపరేటర్లు అందరూ ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు అన్నింట్లో ఇది అందుబాటులో ఉంది. మరి ఈ ఫీచర్‌ను ఎలా వాడాలో తెలుసుకుంటే నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు (WiFi Calling Feature).
ఏమిటీ వైఫై కాలింగ్
వైఫై నెట్వర్క్ ద్వారా ఫోన్ కాల్స్ చేసే సదుపాయాన్నే వైఫై కాలింగ్ ఫీచర్ అని అంటారు. మీ టెలికం ఆపరేటర్ నెట్‌వర్క్ అందుబాటులో లేని సమయాల్లో ఈ ఫీచర్‌తో కాల్స్ చేసుకోవచ్చు. అంటే, సెల్లార్‌లు, పర్వత ప్రాంతాల్లో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ కూడా వాడాల్సిన అవసరం లేదు.
వైఫై కాలింగ్ ఫీచర్‌లో మనం చేసే కాల్స్ సెల్ టవర్‌కు బదులు వైఫై నెట్వర్క్ ద్వారా టెలికం ఆపరేటర్‌కు చేరుతాయి. సమాచారం ఎన్‌క్రిప్టెడ్ విధానంలో టెలికం ఆపరేటర్ సర్వర్‌కు చేరుతుంది. అవతలి వ్యక్తి ఎప్పటిలాగానే కాల్‌ను స్వీకరిస్తారు. ఇక యూజర్ల మునుపటి ప్లాన్ ప్రకారమే మొబైల్ బ్యాలెన్స్ ఉంటుంది.
అయితే, వైఫై కాలింగ్‌లో కాల్ నాణ్యత వైఫై నెట్‌వర్క్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. వైఫై సిగ్నల్స్ సరిగా లేని చోట ఫోన్ మాట్లాడే సమయంలో ఇబ్బంది తలెత్తొచ్చు.
ఇక ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే యాండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో నెట్‌వర్క్ లేదా సిమ్ సెట్టింగ్స్‌లోపల ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్‌లోని సెల్యులర్ లేదా మొబైల్ డేటా ఆప్షన్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా యాక్టివేట్ చేసుకున్నాక మొబైల్ నెట్‌వర్క్ వీక్‌గా ఉన్న చోట ఫోన్ ఆటోమేటిక్‌గా వైఫై కాలింగ్‌కు మారిపోతుంది.
ఇవీ చదవండి:
పాత లాప్‌టాప్‌ను అమ్మే్స్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
iPhone నెమ్మదిస్తోందా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితం మీకే అర్థమవుతుంది!