Share News

చేప మందు పంపిణీ.. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్..

ABN , Publish Date - Jun 07 , 2026 | 08:50 PM

జూన్ 8, 9 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు నగరవాసులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు.

చేప మందు పంపిణీ.. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్..
Hyderabad Fish Prasadam

హైదరాబాద్: ప్రతి ఏడాది ఆస్తమా రోగులకు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీకి సమయం ఆసన్నమైంది. జూన్ 8, 9 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారీ వేలు, లక్షల మంది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేప మందు తీసుకుంటే ఆస్తమా తగ్గుతుందనే నమ్మకంతో తండోపతండాలుగా వస్తుంటారు. అయితే, చేప మందు కోసం వచ్చే వారికి, అలాగే నగర వాసులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఈ రెండు రోజులు ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించి పలు సూచనలు చేశారు.


దారి మళ్లింపు..

హైదరాబాద్ ఎంజే మార్కెట్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పోలీసులు అబిడ్స్, నాంపల్లి జీపీవో (జనరల్ పోస్ట్ ఆఫీస్) వైపు మళ్లించనున్నారు. ఎంజే బ్రిడ్జ్, బేగం బజార్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను అలస్కా జంక్షన్ వద్ద దారుసలాం, ఏక్ మినార్ వైపునకు మళ్లిస్తారు. ఎంజే మార్కెట్- తాజ్ ఐలాండ్ మధ్య ప్రైవేట్, భారీ రవాణా వాహనాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ మార్గంలో వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్, ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి జీపీవో వైపునకు మళ్లించనున్నారు.


పార్కింగ్ సదుపాయం..

నాంపల్లి వైపు నుంచి చేప ప్రసాదం కోసం వచ్చే కార్లు వంటి నాలుగు చక్రాల వాహనదారులు తమ వాహనాలను గృహ కల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ వద్ద పార్క్ చేయాలి. వాహనాల పార్కింగ్ అనంతరం గేట్ నంబర్ 2 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎంజే మార్కెట్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు మనోరంజన్ కాంప్లెక్స్‌లో తమ వాహనాలను పార్క్ చేయాలి. కాగా, నాంపల్లి నుంచి వచ్చేవారు షెజాన్ హోటల్ పక్కన ఉన్న భీమ్ రావు బడా సమీపంలో పార్క్ చేసుకోవాలి.

షెజాన్ హోటల్ ముందు ట్రాఫిక్ పోలీసులు ఆటో స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే అన్ని ఆర్టీసీ బస్సులు, వ్యాన్‌లను కేంద్ర గిడ్డంగుల సంస్థ(CWC) పార్కింగ్ ప్రాంతంలో నిలుపుతారు. ఎంజే మార్కెట్ నుంచి వచ్చే బస్సులు, వ్యాన్‌లకు చివరి స్టాప్ గాంధీ భవన్ బస్ స్టాప్. అదేవిధంగా, నాంపల్లి నుంచి బస్సులు, వ్యాన్‌లలో వచ్చే ప్రయాణికులు గృహ కల్ప బస్ స్టాప్ వద్ద దిగి, కాలినడకన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గేట్ నంబర్ 2 ద్వారా లోపలికి వెళ్లాలి.


వీఐపీ ప్రవేశాలు..

ఎంజే మార్కెట్ నుంచి వచ్చే వీఐపీ పాస్ వాహనదారులందరూ గాంధీ భవన్‌ వైపునకు వెళ్లాలి. అదాబ్ హోటల్ లేన్ వద్ద ఎడమవైపునకు తిరిగి గేట్ నంబర్ 1, సీడబ్ల్యూ గేట్ మీదుగా వీఐపీ ఎంట్రీ గేట్‌నకు చేరుకోవాలి. నాంపల్లి నుంచి వచ్చేవారు గాంధీ భవన్ వద్ద యూటర్న్ తీసుకుని, సీడబ్ల్యూ గేట్ వైపు ఎడమవైపునకు తిరిగి వీఐపీ ఎంట్రీ గేట్‌లోకి ప్రవేశించాలి. వీఐపీ వాహనాలన్నింటినీ కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలోనే పార్క్ చేయాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీ పోరుబాటతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం: ఎమ్మెల్యే ఏలేటి

పదవి పోతుందనే ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారు.. సీఎంపై రాంచందర్ రావు ధ్వజం

Updated Date - Jun 07 , 2026 | 08:59 PM