డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన యువకుడు.. హత్యాయత్నం కేసు నమోదు..
ABN , Publish Date - Jul 27 , 2026 | 09:13 AM
డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువకుడు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే కారుతో దూసుకెళ్లిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ కాలుకు తీవ్ర గాయాలు కాగా, ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
హైదరాబాద్: డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువకుడు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకే కారుతో దూసుకెళ్లిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ కాలుకు తీవ్ర గాయాలు కాగా, ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అబిడ్స్ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నిన్న (ఆదివారం) మధ్యాహ్నం ఓ కారు అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ సమీపానికి చేరుకుంది. కారులోని వ్యక్తికి మరో వ్యక్తి వచ్చి అనుమానాస్పద ప్యాకెట్ అందజేయగా, అక్కడే మాటువేసిన పోలీసులు ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఉన్న నిందితుడిని బయటకు దిగాలని ఆదేశించారు.
అయితే కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన నిందితుడు ఒక్కసారిగా రివర్స్‌లో వేగంగా నడిపాడు. ఈ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ మహేందర్ కాలు మీదుగా కారును ఎక్కించడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌తో పాటు మరో కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, ఇన్‌స్పెక్టర్ తన బృందంతో కలిసి వెంటాడారు. అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో కారును అడ్డుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్‌గా పోలీసులు గుర్తించారు.
మరోవైపు, కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌ను వెంటనే సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ కాలును పరీక్షించిన వైద్యులు విరిగినట్లు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సైఫ్‌ను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ వ్యవహారంతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రీయింబర్స్‌మెంట్ చెల్లించని రేవంత్.. విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి
రష్యా వ్యవసాయ భూముల పేరుతో రూ.1.10 కోట్ల సైబర్ మోసం..