మాకు కులమే ముఖ్యం!
ABN , Publish Date - Jul 27 , 2026 | 06:57 AM
ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రుల్లో కులాల పట్టింపు ఇప్పటికీ చాలా గట్టిగా ఉంది. యువతలో మాత్రం కులాంతర వివాహాల పట్ల సానుకూల ధోరణి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
కులాంతర వివాహాలకు ఒప్పుకోబోమన్న తల్లిదండ్రులు 83.4 శాతం
సమ్మతిస్తామన్నవారు 16.6 శాతమే.. యువతలో మాత్రం 40 శాతం మంది అనుకూలం
మ్యాట్రిమొనీ ప్రొఫైల్స్‌లో కులాలకే ప్రాధాన్యం.. పట్టింపు లేదంటున్నవారు 10 శాతమే
ఉన్నత, పేద వర్గాలతో పోలిస్తే
మధ్యతరగతిలో ఎక్కువగా కులం పట్టింపు!
పరువు ప్రతిష్ఠల గురించి ఆందోళన
హైదరాబాద్, న్యూస్ నెట్‌వర్క్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రుల్లో కులాల పట్టింపు ఇప్పటికీ చాలా గట్టిగా ఉంది. యువతలో మాత్రం కులాంతర వివాహాల పట్ల సానుకూల ధోరణి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఉన్నత, పేద వర్గాలలో ఈ విషయంలో కొంత సడలింపు ధోరణి ఉండగా.. మధ్యతరగతి కుటుంబాలు ఇంకా ‘పరువు’ అనే ఆలోచనా విధానంలో ఇరుక్కుపోయి ఉన్నట్టు తేలింది. కులాంతర వివాహాల విషయంలో.. నేటి యువతీయువకులతోపాటు, వారి తల్లిదండ్రుల మనోభావాలను అంచనా వేసేందుకు ‘ఆంధ్రజ్యోతి’ బృందం ఈ సర్వే నిర్వహించింది. దాంట్లోని ముఖ్యాంశాలు..
తమ పిల్లలు కులాంతర వివాహం చేసుకుంటామంటే ఒప్పుకోబోమని.. సర్వేలో పాల్గొన్నవారిలో 83.4 శాతం మంది చెప్పారు. అడ్డుకోబోమని.. అంగీకరిస్తామని చెప్పిన తల్లిదండ్రులు కేవలం 16.6 శాతం మంది మాత్రమే.
సర్వేలో పాల్గొన్న యువతలో 29.3 శాతం మంది కులాంతర వివాహాలకు మొగ్గుచూపగా.. 10 శాతం మంది తమ పెళ్లి ఇప్పటికే వేరే కులానికి చెందిన వ్యక్తితో అయినట్టు చెప్పారు. 60.7 శాతం మంది మాత్రం ప్రతికూలమని చెప్పారు.
సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 4.7 శాతం మంది.. తమ పిల్లలు ఇప్పటికే కులాంతర వివాహం చేసుకున్నట్టు తెలిపారు.
తెలుగు సమాజంలో కులాంతర వివాహాలను ఆమోదించే క్రమాన్ని పరిశీలిస్తే.. ఆర్థిక ప్రాతిపదికన మూడు స్పష్టమైన ధోరణులు కనిపిస్తున్నాయి. ఉన్నత వర్గాల్లో ‘హోదా, డబ్బు’కే ప్రాధాన్యం తప్ప కులానికి పెద్ద పాత్ర లేదు. వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్లు, రాజకీయ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఇరు కుటుంబాల ఆస్తిపాస్తులు, వ్యాపార విస్తరణ అవకాశాలు, విదేశీ చదువుల నేపథ్యం వంటివి సరిపోతే.. కులాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లకు పెద్దలు పచ్చజెండా ఊపుతున్నారు.
పేద కుటుంబాల్లో పిల్లల సంతోషమే ముఖ్యంగా ఉంటోంది. చదువుకుని సొంత కాళ్లపై నిలబడిన పిల్లలే ఆ కుటుంబాలకు ప్రధాన ఆధారమవుతున్నారు. దీంతో.. పిల్లలు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునున్నప్పుడు వారిపై కుల ప్రాతిపదికన ఒత్తిడి తెచ్చే సామాజిక స్థోమత లేదా ఆర్థిక బలం ఆ తల్లిదండ్రులకు ఉండటంలేదు. దీంతో పిల్లల సంతోషాన్ని, వారి ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెద్దలు కూడా కులాంతర వివాహాలకు అంగీకరిస్తున్నారు.
మధ్యతరగతిని మాత్రం ఇంకా.. ‘పిల్లలు కులాంతర వివాహం చేసుకుంటే బంధువుల్లో పరువేం కావాలి? మిగతా పిల్లలకు పెళ్లిళ్లు ఎలా అవుతా యి?’ అనే ఆలోచనలు పట్టిపీడిస్తున్నాయి. ఈ వర్గంలోనే కులాంతర పెళ్లిళ్లపై తీవ్ర వ్యతిరేకతలు, ఘర్షణలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
మ్యాట్రిమోనీల్లో కులమే ప్రధానం..
సమాజంలో వస్తున్న సాంకేతిక మార్పులు (ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వంటివి) కులాంతర పరిచయాలను, దరిమిలా కులాంతర వివాహాల సంఖ్యను పెంచుతుంటే.. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రధాన వేదికలైన మ్యాట్రిమొనీ వెబ్‌సైట్లలో మాత్రం కులాధిపత్యం ఇంకా తగ్గట్లేదు. ఆయా వెబ్‌సైట్లలో ఇప్పటికీ 90 శాతానికిపైగా ప్రొఫైళ్లలో ‘క్యాస్ట్/సబ్‌క్యా్‌స్ట’లకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. ‘కులం పట్టింపు లేదు’ (క్యాస్ట్ నో బార్) అనే ఆప్షన్‌ను ఎంచుకునే కుటుంబాల సంఖ్య 10 శాతం లోపే ఉండటం గమనార్హం.
గ్రామీణ ప్రాంతాల్లో..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కులాంతర వివాహాల సరళిని పరిశీలిస్తే.. ఉన్నత విద్యాలయాలు, ఐటీ కంపెనీలు, బహుళ సంస్కృతులు ఉండే నగరాల్లో ఇవి అత్యధికంగా నమోదవుతుండగా.. సంప్రదాయాలకే పెద్ద పీట వేసే మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ తరహా పెళ్లిళ్లను అడ్డుకుంటూనే ఉన్నా రు. తెలంగాణలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఐటీ కారిడార్లు, ఇంజినీరింగ్ కళాశాలలు, పరిశ్రమ కేంద్రాలు ఉండటంతో ఇక్కడ ఎక్కువ కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతుండగా.. రాయలసీమలో మారుమూల గ్రామీణ, కులాధిపత్యం ఎక్కువగా ఉండే లోతట్టు పల్లెలు, ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి జిల్లాలో ఇవి తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక కులం పట్టింపు ఇంతగా ఉన్నప్పటికీ.. అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు రెండు రాష్ట్రాల్లోనూ ప్రేమ వివాహాల సంఖ్య ఏటా పెరుగుతోంది. వీటిలో ఏకంగా 70 శాతానికి పైగా కులాంతర వివాహాలే.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలోనూ కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో కులాంతరం ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటమే..
ప్రేమికులకు 30 రోజుల గండం
కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నా.. వారికి చట్టపరంగా ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ప్రత్యేక వివాహ చట్టం-1954లోని 30 రోజుల నోటీసు నిబంధన. దీని ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కులాంతర వివాహానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజుల ముందస్తు నోటీసును ఆఫీసు బోర్డుపై ప్రదర్శించాలి. కొన్నిచోట్ల అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు నేరుగా నోటీసులు పంపుతున్నారు. దీంతో కుటుంబీకులు, కుల సంఘాల నేతలు ముందే రంగంలోకి దిగి ఆయా జంటలను నిర్బంధించడం, బెదిరించడం వంటివి చేస్తున్నారు. వారినుంచి రక్షణ కోరుతూ యువ జంటల నుంచి రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో ఏటా వందలాది పిటిషన్లు దాఖలవుతున్నాయి. పలు జిల్లాల్లో.. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపై భౌతికదాడులు, అమ్మాయిలను కిడ్నాప్ చేసిన కేసులు గణనీయంగానే నమోదవుతున్నాయి. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులు కన్న బిడ్డనే కడతేరుస్తున్న ఘటనలూ కంటతడి పెట్టిస్తున్నాయి.
నచ్చినవారిని చేసుకునే హక్కుంది
రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం.. మేజర్లయిన వారు తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునే హక్కు ఉందని శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రద జీవితం, జీవిత భాగస్వామిని స్వేచ్ఛగా ఎంచుకునే హక్కుకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించిన కీలక తీర్పుగా ఇది గుర్తింపు పొందింది. ఇక ప్రత్యేక వివాహాల చట్టంలో ఉన్న 30 రోజుల నోటీసు విధానాన్ని ఆన్‌లైన్ ప్రాసెస్‌చేసి రహస్యంగా ఉంచాలి. కులోన్మాద హత్యలను, బహిష్కరణలను అరికట్టడానికి యాంటీ ఆనర్ కిల్లింగ్ యాక్ట్ తేవాలి. - ఏమిరెడ్డి సుమశ్రీ, సీనియర్ అడ్వకేట్, నల్లగొండ
ఈ వార్తలు కూడా చదవండి
150 ఏళ్ల నాటి కరువు పరిస్థితి..
రీయింబర్స్‌మెంట్ చెల్లించని రేవంత్.. విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి