జూరాలను తాకిన కృష్ణమ్మ
ABN , Publish Date - Jul 27 , 2026 | 06:00 AM
ఎట్టకేలకు కృష్ణమ్మ జూరాలను తాకింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంకు వరద ప్రవాహం పెద్దఎత్తున చేరుతుండడం..
నేడు ఎంజీఎల్‌ఐ నుంచి రిజర్వాయర్లకు నీరు
బంగాళాఖాతంలో వాయుగుండం
హైదరాబాద్‌లో ఆదివారం వర్షం
పలు జిల్లాల్లోనూ కురిసిన వానలు
నిర్మల్‌లో పిడుగుపడి మహిళ మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఎట్టకేలకు కృష్ణమ్మ జూరాలను తాకింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంకు వరద ప్రవాహం పెద్దఎత్తున చేరుతుండడం, నారాయణపూర్ డ్యాం కూడా నిండుతుండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు ఆదివారం ఉదయం నుంచి కొద్దికొద్దిగా వరద ప్రారంభమై మధ్యాహ్నం వరకు 18 వేలు, రాత్రికి 22,600 క్యూసెక్కులకు చేరింది. సోమవారం మరింత పెరిగే అవకాశం ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 35వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రస్తుతం జూరాల జలాశయంలో నీటి నిల్వ 5.897 టీఎంసీలకు చేరింది. ఆలమట్టిలో వరద ప్రవాహం ఇదే తరహాలో కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రవాహం మొదలయ్యే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి నిల్వలు చేరిన తర్వాతే ఎత్తిపోతల పథకాలకు, కాలువలకు నీరందిస్తామని ఆ ప్రాజెక్టు డీఈ నాగేశ్వర్ రావు తెలిపారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న మహాత్మాగాంధీ లిఫ్టు ఎత్తిపోల పథకం (ఎంజీఎల్‌ఐ) ద్వారా ప్రధాన రిజర్వాయర్లకు సోమవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు ఇన్‌చార్జి ఈఈ లోకిలాల్ తెలిపారు. సింగోటం, జొన్నగబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపనున్నట్లు స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
కమ్మేసిన వాన మబ్బులు!
న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతం నుంచి అరేబియా సముంద్రం వరకు విస్తరించిన వాన మేఘాలు 95 శాతం భూభాగాన్ని కమ్మేశాయి. ప్రస్తుతం కొంత తగ్గిన్పటికీ.. దేశంలో 88 నుంచి 92 శాతం భూభాగం మేఘాలతో కప్పి ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ఈ నెల 21-22 తేదీల్లో 95 శాతం మేఘావృతమై ఉండగా.. ప్రస్తుతం అది 90 శాతంగా ఉంది.