Share News

రీయింబర్స్‌మెంట్‌ చెల్లించని రేవంత్‌.. విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి

ABN , Publish Date - Jul 27 , 2026 | 06:07 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి... విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

రీయింబర్స్‌మెంట్‌ చెల్లించని రేవంత్‌.. విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి

  • ‘21 ఏళ్లకే పోటీ’ అంశంపై సీఎంకు అధికారం లేదు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌ సిటీ/బర్కత్‌పుర, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి... విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసి నిజాయితీ చాటుకున్నారని, తెలంగాణలో రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి చెల్లించకుండా తాత్సారం చేస్తున్న రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. సికింద్రాబాద్‌ టివోలీ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకలతో పాటు మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్‌ రెడ్డి సర్కార్‌ క్యాండిల్‌ ర్యాలీలు చేయడం సిగ్గుచేటని, భవిష్యత్తులో అదే క్యాండిల్‌తో విద్యార్థులు, యువత వారిని తగలబెడతారన్నారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో విదేశీ హస్తం ఉందని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. యువత, కాంగ్రెస్‌ నిరసనలతో కేంద్రం దిగి వచ్చిందనే మాటలు అవాస్తమన్నారు. యువతకు 21 ఏళ్లకే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న రేవంత్‌ వ్యాఖ్యలను రాంచందర్‌రావు ఖండించారు. ఎన్నికల వయోపరిమితిపై నిర్ణయం తీసుకునే అధికారం సీఎంకు లేదని, ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్నారు. యువతను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ఈ పరేడ్‌ గ్రౌండ్స్‌లోని వీర సైనిక స్మారక స్థూపం వద్ద రాంచందర్‌రావు నివాళులు అర్పించారు.


మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి ధన్వంతరి అవార్డు

ఆరోగ్య భారత్‌ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం కృషి చేస్తోందని రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ మెడికల్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ధన్వంతరి అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్‌ ప్రీతి రెడ్డితో పాటు పలువురు వైద్యులను సన్మానించారు.

Updated Date - Jul 27 , 2026 | 06:32 AM