Share News

భారీ వర్షాలు.. జలకళను సంతరించుకున్న నీటి ప్రాజెక్టులు..

ABN , Publish Date - Jul 30 , 2026 | 07:17 AM

తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వానలకు కృష్ణా, గోదావరి బేసిన్‌లోని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతుండగా.. రైతన్నల ఆశలు చిగురిస్తున్నాయి.

భారీ వర్షాలు.. జలకళను సంతరించుకున్న నీటి ప్రాజెక్టులు..
Godavari Floods

హైదరాబాద్: తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వానలకు కృష్ణా, గోదావరి బేసిన్‌లోని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతుండగా.. రైతన్నల ఆశలు చిగురిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 46 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 12.8864 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Water2.jpg


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ఇన్‌ఫ్లో 96,445 క్యూసెక్కులకు చేరుకోగా, అదే స్థాయిలో 24 గేట్లను ఎత్తి 96,472 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేరు జలాశయానికి ఎల్లంపల్లి నుంచి గాయత్రీ పంప్‌హౌస్ ద్వారా మూడు మోటార్ల సహాయంతో 12,400 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. లోయర్ మానేరు జలాశయానికి 1,230 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ వర్షాకాలంలో లోయర్ మానేరు జలాశయానికి నమోదైన తొలి ఇన్‌ఫ్లో ఇదే కావడం విశేషం. కొమురం భీం జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 3 గేట్లు ఎత్తి 10,500 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Water3.jpg


జగిత్యాల జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరిగింది. అనంతారం బ్రిడ్జి వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మపురి వద్ద గోదావరి నీరు పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. అంక్సాయిపల్లె సమీపంలో వరద ఉద్ధృతి కారణంగా ధర్మపురికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఇందారం, శ్రీరాంపూర్, కల్యాణి ఖని, ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రోజుకు సుమారు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు స్తంభించాయి. వర్షాలు తగ్గిన తర్వాతే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Godhavari.jpg


ఈ వార్తలు కూడా చదవండి

యాదాద్రిపై పార్టీతో చర్చిస్తే బాగుండేది

మైనర్ల చేతికి స్టీరింగ్‌..

Updated Date - Jul 30 , 2026 | 08:02 AM