Share News

యాదాద్రిపై పార్టీతో చర్చిస్తే బాగుండేది

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:59 AM

యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటుపై ప్రభుత్వ పెద్దలు పార్టీతోనూ చర్చిస్తే బాగుండేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ‘యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్‌ భాగస్వామ్యం ఉంటే..

యాదాద్రిపై పార్టీతో చర్చిస్తే బాగుండేది

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటుపై ప్రభుత్వ పెద్దలు పార్టీతోనూ చర్చిస్తే బాగుండేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ‘యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్‌ భాగస్వామ్యం ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నది సీఎం ఆలోచన కావచ్చు. ఆయన ఆలోచనను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే, పాలకమండలి కమిటీ ఏర్పాటు కోసం పార్టీతోనూ చర్చించి ఉంటే బాగుండేది’ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ యంత్రాంగం మధ్య మెరుగైన సమన్వయం కోసం ఇకపై 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కానుందని తెలిపారు. పీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన నాలుగు నెలల తర్వాత కమిటీ తొలి సమావేశం బుధవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగింది.


ఇందులో సీఎం రేవంత్‌, మహేశ్‌ గౌడ్‌తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సమాశానికి కేసీ వేణుగోపాల్‌ అధ్యక్షత వహించాల్సి ఉండగా పార్లమెంటు సమావేశాల్లో ఆయన బిజీగా ఉండటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అధ్యక్షత వహించారు. గంటన్నరపాటు సాగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాబోయే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం మరింత సమన్వయంగా ముందుకెళ్లాలని మీనాక్షి నటరాజన్‌ సూచించారు. ఈ సమావేశం అనంతరం మహేశ్‌గౌడ్‌, భట్టి, ఉత్తమ్‌ వేర్వేరుగా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

పనిచేయని డీసీసీ అధ్యక్షులపై చర్యలు తప్పవు..

సరిగా పనిచేయని ఒకటిరెండు జిల్లాల కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులపై చర్యలు తప్పవని మహేశ్‌గౌడ్‌ హెచ్చరించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, రామగుండం డీసీసీల ఎంపికకు త్వరలోనే ఏఐసీసీ పరిశీలకులు వస్తారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) అసలు ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుందని చెప్పారు. వివిధ కారణాలతో 40 శాతం ఓట్లను పక్కనబెట్టి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటునూ కాపాడాలని సూచించారు. త్వరలో జరగనున్న ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నెల రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. రెండు స్థానాలనూ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్థం చేస్తున్నట్లు వెల్లడించారు. నేతల మధ్య అభిప్రాయబేధాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నామినేటెడ్‌ పదవుల భర్తీకి మరికొంచం సమయం పట్టొచ్చని అన్నారు.


సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలి: భట్టి

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేేసందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్‌ ప్లాన్‌) సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఇన్‌చార్జిలు, పీసీసీ ప్రతినిధులతో చర్చించి ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని, ఆ ప్యానెల్‌ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని అన్నారు. సర్‌ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో పార్టీ బీఎల్‌ఏలు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

డేంజర్‌ జోన్‌లో కాళేశ్వరం: ఉత్తమ్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తీవ్ర ప్రమాదకర స్థితిలో ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వాటిల్లో నీటిని నిల్వ చేస్తే ఏ క్షణంలోనైనా కుప్పకూలే ప్రమాదం ఉందని చెప్పారు. బ్యారేజీల పునాదులు అత్యంత బలహీనంగా ఉన్నట్లు కేంద్ర నిపుణుల బృందాలు నిర్ధారించాయని తెలిపారు. కనీసం సాయిల్‌ టెస్టులు కూడా చేయకుండా ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ ఏకంగా రూ.1,400 కోట్లను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో వసూలు చేసిందని ఆరోపించారు. రాజకీయ స్వలాభం కోసమే బ్యారేజీల్లో నీళ్లు నిల్వచేసి పంపింగ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు మూర్ఖంగా పట్టుబడుతున్నారని మండిపడ్డారు. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషన్‌ నివేదిక ఆధారంగా ఈ దర్యాప్తును సీబీఐ లేదా ఇతర జాతీయ సంస్థలకు అప్పగించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఎన్‌డీఎస్‌ఏ అధికారులతో ఈ నెల 31న సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హైడ్రాతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. అనంతరం ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్‌తో ఉత్తమ్‌, మహేశ్‌గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ భేటీ అయ్యి తుంగభద్ర, కృష్ణా నదీ జలాలకు సంబంధించిన అంతర్‌రాష్ట్ర జల వివాదాలపై చర్చించారు. బుధవారం సాయంత్రం సీఎం రేవంత్‌ హైదరాబాద్‌కు తిరుగు పయణం కాగా.. ఆ తర్వాత మహేశ్‌ గౌడ్‌, భట్టి, ఉత్తమ్‌.. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు.

Updated Date - Jul 30 , 2026 | 06:59 AM