మైనర్ల చేతికి స్టీరింగ్..
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:08 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు నిత్యం పీడకలగా మారుతున్నాయి. 18 ఏళ్లు నిండని పిల్లలు విచ్చలవిడిగా వాహనాలు నడుపుతుండటం వల్ల వారితో పాటు రోడ్డుపై వెళ్తున్న అమాయక..
గ్రేటర్‌లో పెరుగుతున్న జువైనల్ డ్రైవింగ్ కేసులు
పట్టుబడితే 12 నెలల పాటు ఆర్సీ రద్దు.. రూ.25 వేల జరిమానా
అయినా మారని తల్లిదండ్రుల వైఖరి!..
నెలకు 170కి పైగా ఆర్సీల రద్దు
హైదరాబాద్ రవాణా శాఖ సంయుక్త కమిషనర్ కె.వెంకటరమణ
‘‘కొన్నాళ్ల క్రితం ఐటీ కారిడార్‌లో ఓ బాలుడు ఖరీదైన కారును అతివేగంగా నడుపుకుంటూ వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి బాలుడి తండ్రిపై కేసు నమోదైంది.’’
‘‘అంబర్‌పేటకు చెందిన 15 ఏళ్ల బాలుడు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో కన్నుమూశాడు. ‘అసలు డ్రైవింగ్ నేర్పకుండా, బండి చేతికి ఇవ్వకుండా ఉంటే మా బిడ్డ బతికేవాడు కదా’ అని ఆ బాలుడి తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది.’’
గ్రేటర్ హైదరాబాద్‌లో మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు నిత్యం పీడకలగా మారుతున్నాయి. 18 ఏళ్లు నిండని పిల్లలు విచ్చలవిడిగా వాహనాలు నడుపుతుండటం వల్ల వారితో పాటు రోడ్డుపై వెళ్తున్న అమాయక పాదచారులు, ఇతర వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 2024లో 3,283 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 7,808కి పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో కలిపి ట్రై-కమిషనరేట్ల పరిధిలో నెలకు 1500లకు పైగా మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదవుతున్నాయి. దీనిపై రవాణా శాఖ అధికారులు తీవ్రంగా స్పందిస్తూ తనిఖీలను ముమ్మరం చేశారు. గ్రేటర్ పరిధిలో గత రెండేళ్లలో 4,170 వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను (ఆర్సీ) రద్దు చేయగా, నెలకు సగటున 174 ఆర్సీలు రద్దవుతున్నాయి.
పట్టుబడితే 12 నెలలు ఆర్సీ రద్దు..
మైనర్ డ్రైవింగ్ కేసుల్లో వాహన యజమానులు లేదా తల్లిందండ్రులపై మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 199(ఏ) కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఉల్లంఘనకు గానూ తల్లిదండ్రులకు రూ.25వేల జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే సదరు వాహనం ఆర్సీని 12 నెలల పాటు రద్దు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన మైనర్‌కు 25 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. చట్టం ప్రకారం 16 నుంచి 18 ఏళ్లలోపు వారికి కేవలం గేర్లు లేని, 50 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు నడపడానికి మాత్రమే సడలింపు ఉంటుంది.
అన్ని పరిశీలించాకే ఆర్సీ పునరుద్ధరణ..
ఆర్సీ రద్దు వ్యవధి ముగిసినంత మాత్రాన వాహనాన్ని సులభంగా పునరుద్ధరించరని హైదరాబాద్ రవాణా శాఖ సంయుక్త కమిషనర్ డాక్టర్ కె.వెంకటరమణ స్పష్టం చేశారు. రద్దులో ఉన్న 12 నెలల కాలంలో ఆ వాహనం రోడ్డుపైకి వచ్చిందా? చలానాలు పడ్డాయా? ఇతర కేసులు ఉన్నాయా? అని కోర్టు ఆదేశాలు, పోలీస్ నివేదికల ఆధారంగా పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే పునురుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.