ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు
ABN , Publish Date - Jun 30 , 2026 | 08:40 PM
రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎక్స్ (X) వేదికగా స్పందించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు.
హైదరాబాద్: రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో స్పందించిన ఆయన, ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. రైతు భరోసా పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం తప్ప రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు.
రైతుల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్న లెక్కలపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారని గుర్తు చేశారు. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజమో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 2027 మార్చి 31 వరకు వ్యవసాయ రంగానికి మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82 వేల కోట్లు ఉంటే, జూన్ 2026 నాటికే లక్షా 56 వేల కోట్లు లేదా లక్షా 75 వేల కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో లేని నిధులను ఖర్చు చేశారా? లేక రైతులను తప్పుదోవ పట్టించేందుకు కల్పిత లెక్కలు చెబుతున్నారా? అని నిలదీశారు.
రుణమాఫీ అంశంపై కూడా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు స్వల్పకాలిక రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం హామీ ఉల్లంఘనేనని విమర్శించారు. మేనిఫెస్టోలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రచార కార్యక్రమాల కంటే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీతో పాటు ఏ వేదికలోనైనా చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు.
Also Read:
డెలివరీ బాయ్‌తో వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్