భారీగా అక్రమాస్తులు.. మొయినాబాద్ టీపీఓ గుండు వాణిపై ఏసీబీ కేసు నమోదు
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:51 PM
మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణి (టీపీఓ) గుండు వాణిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కొరడా ఝుళిపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, నవంబర్16: మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణి (టీపీఓ) గుండు వాణిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కొరడా ఝుళిపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెపై కేసు నమోదు చేశారు. వాణి ఇల్లు, కార్యాలయంతోపాటు 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.6.76 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. అత్తాపూర్‌లో రూ.2.45 కోట్ల విలువైన జీ+2 భవనంతో పాటు మరో రూ. 63 లక్షల విలువైన ఫ్లాట్‌ను ఏసీబీ అధికారులు కనుగొన్నారు.

అలాగే జడ్చర్ల, పాలకుర్తిలో ఓపెన్ ప్లాట్లు.. కోయిలకొండలో 1.10 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్‌నగర్‌లోని తుల్జా భవానీ వైన్స్‌లో రూ. 50 లక్షల పెట్టుబడులు ఆమె పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక వివిధ కంపెనీల షేర్లలో రూ.1.30 కోట్ల మేర గుండు వాణీ పెట్టుబడులు పెట్టిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ సోదాల్లో రూ.5.47 లక్షల నగదు.. బ్యాంకు ఖాతాల్లో రూ.7.97 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. 175.1 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 లక్షల విలువైన రెండు కార్లతో సహా నాలుగు వాహనాలు ఉన్నట్లు గుర్తించారు.
అయితే ఇప్పటికే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు టీపీఓ గుండు వాణి పట్టుబడిన విషయం విదితమే. సెప్టెంబర్ 30న రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గుండు వాణి పట్టుబడింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఆమె ఉంది. పీటీ వారెంట్‌పై ఏసీబీ స్పెషల్ కోర్టు ముందు టీపీఓ వాణిని హాజరుపరిచేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.