Share News

గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీలు బీసీలకే

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:13 AM

త్వరలో భర్తీ చేయబోయే మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీసీలకే ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రకటించారు.

గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీలు బీసీలకే
Mahesh Kumar Goud

  • బీసీలకు మరిన్ని మంత్రి పదవుల కోసం కృషి చేస్తాం: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): త్వరలో భర్తీ చేయబోయే మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీసీలకే ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రకటించారు. తాజాగా రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులుగా రెడ్డి సామాజికవర్గం వారినే ఎంపిక చేసిన నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన ఆశావహులు శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను ఆయనకు వివరించారు. రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు టికెట్లను రెడ్లకే ఇచ్చినందున.. త్వరలో ఖాళీ అయ్యే మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకే ఇవ్వాలని కోరారు. కనీసం రెండు స్థానాలనైనా కేటాయించాలన్నారు. మంత్రివర్గంలో అవకాశం లభించని బీసీల్లోని ఇతర సామాజిక వర్గాలకు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యమే లేనందున.. ఈసారి ఎమ్మెల్సీల్లో ఆ జిల్లాకు అవకాశం కల్పించాలన్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని నామినేటెడ్‌, పార్టీ పదవులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ పదవుల్లో బీసీలకు 42 శాతం కేటాయించాలన్నారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారిని కాపాడుకుంటామని, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పార్టీ కోణంలో జరిగిందని చెప్పారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఇద్దరు బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. దసరా నాటికి 60 కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌ పదవులను భర్తీ చేస్తామన్నారు. బీసీలకు మరిన్ని మంత్రి పదవులు ఇవ్వడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. యువతకు కూడా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...
తొలగించిన కులాల పేరిట 2,123 బీసీ సర్టిఫికెట్లు.. విచారణకు బీసీ కమిషన్‌ ఆదేశం

గోదావరి ఫేజ్‌-2, 3 ప్రాజెక్టులకు రూ.2,944 కోట్ల హడ్కో రుణం.. రూ.59 కోట్ల గ్యారంటీ కమీషన్‌ మినహాయింపు

అపార్ట్‌మెంట్లకు ఫైర్‌ ఎన్‌వోసీ పరిమితి పెంపు.. 24 మీటర్ల వరకు అనుమతి

Updated Date - Oct 04 , 2026 | 06:45 AM