Share News

అందమైన భూమిని నియంతలు పాలించొద్దు

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:55 AM

అందమైన భూగ్రహాన్ని నియంతలు పాలించటం ఎంతమాత్రమూ అంగీకరించబోమని.. భూమిని, ప్రజలను సంరక్షించుకునే సమర్థత ఉన్న వారే అసలైన నాయకులని ‘భారతీయ సమ్మిట్‌’లో విదేశీ ప్రతినిధులు ఎలుగెత్తి చాటారు.

అందమైన భూమిని నియంతలు పాలించొద్దు
Bharat Summit 2026

  • వారిని అంగీకరించం.. భూమిని, ప్రజల్ని సంరక్షించేవాళ్లే సిసలైన నాయకులు

  • సాంకేతిక పురోగతి కొందరిని ధనవంతులను చేయడానికి కాదు..

  • అందరికీ ఉపయోగపడాలి

  • సరిహద్దులు లేని సంక్షోభాల్ని సరిహద్దులకు అతీతంగా ఎదుర్కొందాం..

  • మరో ప్రపంచాన్ని నిర్మిద్దాం

  • రాజకీయ ప్రజాస్వామ్యంతోపాటు సామాజిక ప్రజాస్వామ్యం కూడా అవసరం

  • భారతదేశ భావి ప్రధాని రాహుల్‌గాంధీ

  • ‘గ్లోబల్‌ సమ్మిట్‌’ ముగింపు సమావేశంలో విదేశీ ప్రతినిధులు

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అందమైన భూగ్రహాన్ని నియంతలు పాలించటం ఎంతమాత్రమూ అంగీకరించబోమని.. భూమిని, ప్రజలను సంరక్షించుకునే సమర్థత ఉన్న వారే అసలైన నాయకులని ‘భారతీయ సమ్మిట్‌’లో విదేశీ ప్రతినిధులు ఎలుగెత్తి చాటారు. అన్యాయంపై ఆధారపడి సామాజిక న్యాయాన్ని నిర్మించలేమని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుంటే మౌనంగా ఉండటం సాధ్యం కాదన్నారు. ప్రజలందరినీ పట్టించుకునేలా మరో ప్రపంచం ఉండాలని, దీనికోసం సరిహద్దులకు అతీతంగా ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. శనివారం ‘భారత్‌ సమ్మిట్‌’ ముగింపు కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన వక్తలు ప్రసంగించారు. వివరాలు వారి మాటల్లోనే..


పార్టీలు ఎన్నికలకే పరిమితం కావొద్దు

రాజకీయపార్టీలు ఎన్నికల్లో పోటీపడేందుకు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రజలకు ఉపయోగపడే ప్రజా విధానాల రూపకల్పన కూడా వాటి బాధ్యతే. ప్రజలు, దేశ ఆర్థికాభివృద్ది, అంతర్జాతీయ సహకారంలో అవి ముఖ్యపాత్ర పోషించాలి. ఆఫ్రికా, భారత్‌ మధ్య ప్రజాస్వామ్యం, ఆర్థిక, పారిశ్రామిక, సంస్థాగత అభివృద్ధి, యువతకు సాధికారత కల్పించడం వంటి రంగాల్లో మరింత లోతైన సహకారానికి అవకాశాలున్నాయి. ఎన్ని సమావేశాలు నిర్వహించామనే దానికంటే ఏ విధమైన భాగస్వామ్యాలు నిర్మించాం, ఎలాంటి ఫలితాలు సాధించామనేదే ముఖ్యం. ఈ సదస్సు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు.

- కోట్‌ డి ఐవరీ మాజీ ప్రధాని పాస్కల్‌ అఫి ఎన్‌గుస్సన్‌


అన్యాయంపై ఆధారపడి సామాజిక న్యాయాన్ని నిర్మించలేం

అన్యాయంపై ఆధారపడి సామాజిక న్యాయాన్ని నిర్మించలేం. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసినప్పుడు మౌనంగా ఉండలేం. టర్కీలో ప్రతిపక్ష నేతలను అణచివేస్తున్నారు. భారత్‌లో విద్యార్థులు, యువకులు, ప్రతిపక్షాలు ఓటరు హక్కుల కోసం, విద్యా సంస్కరణల కోసం పోరాడుతున్నాయి. ఈ పోరాటాలకు కేంద్రంగా రాహుల్‌గాంధీ-కాంగ్రెస్‌ పార్టీ ఉన్నాయి. అంబేద్కర్‌ చెప్పినట్లు రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు సామాజిక ప్రజాస్వామ్యం కూడా ఉండాలి. ఉక్రెయిన్‌, పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలవాలి.

- యూరోపియన్‌ సోషలిస్టు పార్టీ జనరల్‌ సెక్రటరీ జోకో మోఫెలిక్‌


అవర్‌ వరల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ ఇనిషియేటివ్‌ ప్రారంభం

మన భూగ్రహం అందమైనది. దీనిని నియంతలు పాలించడాన్ని అంగీకరించలేం. ప్రజలను, భూమిని సంరక్షించగల సమర్థులైన నేతలు మనకు కావాలి. రాహుల్‌గాంధీ అలాంటి నాయకత్వానికి స్ఫూర్తిదాయక ఉదాహరణ. బ్రెజిల్‌, అమెరికా మధ్యంతర ఎన్నికల్లానే భారత్‌లోనూ ప్రజల కోరిక పూర్తిగా నెరవేరుతుందని నమ్ముతున్నా. ప్రపంచ ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం ఒక నూతన పాలనా విధానాన్ని రూపొందించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. పలు దేశాలకు చెందిన ప్రతినిధులతో ‘అవర్‌ వరల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ ఇనిషియేటివ్‌’ అనే థింక్‌ట్యాంక్‌ను ప్రారంభించనున్నాం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై నూతన కూటమిగా ఏర్పడాలి. ఇందులో భారత్‌ కీలక పాత్ర పోషించాలి.

- యూరోపియన్‌ ప్రోగ్రెసివ్‌ స్టడీస్‌ ఫౌండేషన్‌ మాజీ అధ్యక్షురాలు మరియా జావో


భారతదేశ భావి ప్రధాని రాహుల్‌గాంధీ

భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది. ఈ దేశాన్ని కాపాడుకోవాలి. దానికి ఉత్తమ మార్గం రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవడమే. భారతదేశ భావి ప్రధాని రాహుల్‌గాంధీనే. నిజమైన ప్రజాస్వామ్యం అవినీతితో, మోసంతో కూడినది కాదు. నకిలీది కాదు. ‘ఓట్‌ చోర్‌.. గద్దీ చోడ్‌’ అన్న నినాదంతో కొన్ని వారాల క్రితం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం దద్దరిల్లింది. ప్రజాస్వామ్యం ఊరికే రాదని, దానికోసం నిలబడేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలే దానిని కాపాడతారని ఆ భారీ సభ గుర్తుచేసింది.

- ఫిలిబెక్‌, సెక్రటరీ జనరల్‌,

యూరోపియన్‌ సోషలిస్టు పార్టీ


మరో ప్రపంచం ఎలా ఉండాలంటే

ఇప్పుడున్న దానికి భిన్నంగా మరో ప్రపంచం ఎలా ఉండాలన్నది మనమందరం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. నా దృష్టిలో... అది ప్రజలందరినీ పట్టించుకునే ప్రపంచం అయి ఉండాలి. సాంకేతిక పురోగతి కేవలం కొందరిని ధనవంతులను చేయడం కాకుండా అందరికీ సేవ చేసేలా ఉండాలి. ప్రాథమిక హక్కులు, న్యాయం అనేవి వర్ణం, మతం, కులంతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా చెందే ప్రపంచం కావాలి. భారత్‌ సమ్మిట్‌ స్ఫూర్తితో ప్రారంభిస్తున్న ‘న్యూ వరల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా.

- థాయ్‌లాండ్‌ ప్రోగ్రెసివ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ తాన్‌థోర్న్‌


ఇవి కూడా చదవండి...

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం

Updated Date - Nov 15 , 2026 | 04:55 AM