Share News

తిండికి తిప్పలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:31 AM

హైదరాబాద్‌ అంటేనే ధమ్‌ బిర్యానీ, ఇరానీ చాయ్‌కు ఫేమస్‌. ఇతర ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చే వేలాది మంది వాటి రుచి చూడకుండా వెళ్లరు.

తిండికి తిప్పలు

  • గ్యాస్‌ కొరతతో మెస్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల మూత

  • చాలాచోట్ల టమాట రైస్‌ మాత్రమే..

  • దోశ, పూరి, వడ బంద్‌.. ఇడ్లీ ఒక్కటే..

  • కనిపించని మిర్చి బజ్జీ, వడల బండ్లు

  • ఆర్డర్లు లేక ఉపాధి కోల్పోయిన స్విగ్గీ, జొమాటో డెలివరీ సిబ్బంది

  • రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల కొరత

  • గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్‌ బుకింగ్‌కు 45 రోజుల గడువు

  • పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల నిబంధన కొనసాగింపు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ అంటేనే ధమ్‌ బిర్యానీ, ఇరానీ చాయ్‌కు ఫేమస్‌. ఇతర ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చే వేలాది మంది వాటి రుచి చూడకుండా వెళ్లరు. కానీ ఘుమఘుమలాడే హైదరాబాదీ బిర్యానీకి గ్యాస్‌ సంక్షోభంతో కష్టకాలం వచ్చింది. ఇరానీ చాయ్‌ కూడా అందని ద్రాక్షగా అయింది. ఇవే కాదు.. కాయగూరల వంటకాలు, నాన్‌ వెజ్‌ కర్రీస్‌ కూడా కనిపించని పరిస్థితి! నాలుగు రోజుల క్రితం వరకు కళకళలాడిన హైదరాబాద్‌లోని హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, మిర్చి బజ్జీలు, సమోసా స్టాళ్లు గ్యాస్‌ కొరతతో మూతపడుతున్నాయి. దీంతో చదువు, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాల కోసం హైదరాబాద్‌ వచ్చి ఉంటున్నవారికి తిండికి తిప్పలు పడుతున్నారు. వివిధ పనులపై హైదరాబాద్‌ వచ్చే లక్షలాది మందికీ భోజన బాధలు తప్పడం లేదు. హాస్టళ్ల మెనూ నుంచి చపాతీ, దోశలను కట్‌ చేయడంతో పాటు భోజనంలో ఒకటే కూర వడ్డిస్తున్నారు.


చాలా హోటళ్లు భోజనం లేదని బోర్డులు పెట్టేస్తున్నాయి. టిఫిన్ల ధరలు పెంచేశాయి. దోశ, పూరి, చపాతి, పరోట వంటి టిఫిన్లు తయారు చేయడం లేదు. ఇడ్లీ, లెమన్‌ రైస్‌, టమాటా రైస్‌, పెరుగన్నం మాత్రమే మెనూలో పెడుతున్నాయి. ఐటీ కంపెనీల్లో క్యాంటీన్లూ మూతపడేలా ఉన్నాయి. చాలావరకు కర్రీ పాయింట్లు మూసివేశారు. మధురానగర్‌, ఎల్లారెడ్డి, ఎస్‌ఆర్‌ నగర్‌లో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. టిఫిన్‌ సెంటర్ల విషయానికొస్తే గతంలో పలు ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, కొందరు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు నిర్వహించేవారు. ఇప్పుడు ఉదయం పెడుతున్న వారు మధ్యాహ్నానికే బంద్‌ చేస్తుండగా.. రాత్రిపూట టిఫిన్‌ సెంటర్లు అసలు కనిపించడం లేదు. కాలనీలు, రోడ్ల వెంట పెట్టే మిర్చి బజ్జీలు, వడల బండ్లు కూడా తక్కువయ్యాయి. ఇదిలా ఉండగా, గ్యాస్‌ కొరతతో వ్యాపారం నాలుగో వంతుకు పడిపోయిందని కేపీహెచ్‌బీలోని ఓ పేరొందిన మెస్‌ యజమాని తెలిపారు. మెస్‌లో రోజుకు 8 రకాల కూరలు, రెండు రకాల చట్నీలు చేస్తుంటారు. ప్రతి రోజూ 3 సిలిండర్లు అవసరమయ్యేవి. రోజుకు రూ. 80 వేల వ్యాపారం జరిగేది. వాణిజ్య గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో కట్టెల పొయ్యిపై కేవలం మూడు రకాల కూరలు, ఒక రోటి పచ్చడి తయారు చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నారు. రోజుకు రూ.20 వేల వ్యాపారం కూడా జరగడం లేదని, వర్కర్లకు జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నానని తెలిపారు. కాగా, నచ్చిన కూరలు, వంటలు లభించకపోవడంతో భోజనప్రియులు నిరాశకు లోనవుతున్నారు.


5 వేల నుంచి 500కు...

గతంలో రోజుకు 5 వేల పైగా బిర్యానీలు విక్రయించగా ఇప్పుడు 500 వరకు కూడా తయారుచేయలేని పరిస్థితి నెలకొందని సికింద్రాబాద్‌ ప్రాంతంలోని ఓ పేరొందిన హోటల్‌ యజమాని తెలిపారు. టోలీచౌకీలోని మరో బిర్యానీ హోటల్‌లో కట్టెల పొయ్యిపై అరకొరగా తయారుచేస్తున్నారు. హైదర్‌గూడలో బిర్యానీ కోసం నిత్యం వందల మంది కస్టమర్లు వచ్చే ఓ పేరొందిన హోటల్‌ను గ్యాస్‌ దెబ్బతో పూర్తిగా బంద్‌ చేశారు. హైదరాబాద్‌లో 200కు పైగా ఫేమస్‌ బిర్యానీ హోటళ్లు, రెస్టారెంట్లు, 40 వేలకు పైగా సెంటర్లు ఉన్నాయి. గ్యాస్‌ కొరతతో అవన్నీ కుదేలయ్యాయి. హోటళ్లలో ఇరానీ చాయ్‌ తయారీని కూడా నిలిపివేశారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఎక్కువగా ఇష్టపడే ఇరానీ చాయ్‌ బంద్‌ కావడంతో నిరాశకు లోనవుతున్నారు. దాదాపు 70 శాతం కంటే ఎక్కువగా టిఫిన్‌, టీ స్టాళ్లను బంద్‌ చేసినట్లు తెలుస్తోంది.

స్విగ్గీ, జొమాటో డెలివరీ సిబ్బంది ఉపాధికి దెబ్బ

స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ సంస్థలపై వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో బిర్యానీలు, ఇతర వంటల తయారీ అంతగా లేకపోవడంతో వారికి ఆర్డర్లు రావడం లేదు. దీంతో వారు రెండు రోజులుగా ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారు. హైదరాబాద్‌లో పని లేకపోవడంతో ఇంటికి వెళ్లినట్లు వరంగల్‌కు చెందిన తరుణ్‌ (పేరు మార్చాం) తెలిపాడు. ఓ కాలేజీలో పీజీ చదువుతూ హాస్టల్‌లో ఉండేవాడినని, సాయంత్రం వేళ బిర్యానీలు డెలివరీ చేస్తూ రూ.600-100 వరకు సంపాందించేవాడినని చెప్పాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇంటికి వచ్చేశానన్నాడు.

Updated Date - Mar 13 , 2026 | 04:31 AM