Share News

తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:40 PM

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు లొంగియారు. దేవ్‌జీ, మల్లారాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి.. డీజీపీ ఎదుట సరెండర్ అయ్యారు.

తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు
Maoist surrender

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. వీరిలో పొలిట్ బ్యూరో సభ్యుడు (పీబీఎం) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (సీసీఎం) మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్‌సీఎం) నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రన్నా దాదా ఉన్నారు. 40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో పనిచేసిన ఈ అగ్రనేతలు లొంగుబాటు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయినట్లు పోలీసులు ప్రకటించారు.


ఆ 11 మంది జనజీవనంలోకి రండి: డీజీపీ

ఈ నలుగురి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో అగ్రస్థాయి బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు కీలక నేతలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన ఇంకా 11 మంది అజ్ఞాతంలో ఉన్నారని అన్నారు. వారు కూడా త్వరలో జనజీవనంలోకి రావాలని డీజీపీ కోరారు. ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి అడవుల్లో లేరని, బయట ఎక్కడో షెల్టర్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీపై రూ.25 లక్షలు, మల్లారాజి రెడ్డిపై రూ.25 లక్షలు, బడే చొక్కారావు, నూనె నరసింహా రెడ్డిలపై రూ.20 లక్షల చొప్పున నగదు రివార్డు మొత్తాన్ని వారికి అందజేస్తామని ప్రకటించారు. 2019లో తెలంగాణలో మావోయిస్టులు రిక్రూట్‌మెంట్ జరిగిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.


dev-ji.jpg

దేవ్‌‌జీ నేపథ్యం ఇదే..

1982లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్‌లో చేరిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ దండకారణ్యంలో ఆయుధ దళ కార్యకలాపాలు నిర్వహించారు. 1984-89 మధ్య సిరోంచా, పెరిమిలి ప్రాంతాల్లో దళ కమాండర్‌గా పనిచేశారు. 1989లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2001లో సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా, 2017లో సీఎంసీ ఇన్‌ఛార్జ్‌గా, తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా(పీబీఎం) ఎదిగారు.

raji-reddi.jpg

మల్లారాజి రెడ్డి అలియాస్ రంగారాం..

1970లలో ఉద్యమంలోకి వచ్చిన మల్లారాజి రెడ్డి..1980లలో డివిజనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారు. 1990లో సీసీఎంగా నియమితులయ్యారు. మహారాష్ట్ర, దండకారణ్య ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2007లో పీబీ సభ్యత్వం, 2010-16 మధ్య ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు.

chikkarao.jpg

బడే చొక్కారావు..

1996లో ఆర్‌ఎస్‌యూ ద్వారా పార్టీలో చేరి 1999-2000లో ఏటూరునాగారం-మహాదేవపూర్ ప్రాంతాల్లో పార్టీ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ, ఇతర ప్రాంతీయ కమిటీలలో కీలక బాధ్యతలు చేపట్టారు. నూనె నరసింహా రెడ్డి కూడా రాష్ట్ర కమిటీ స్థాయిలో కీలక పాత్ర పోషించారు.


ఇవి కూడా చదవండి...

జగన్‌ ఎందుకు వెనకేసుకొస్తున్నారు.. మీకూ భాగస్వామ్యముందా?: డిప్యూటీ సీఎం పవన్

కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా: హరీశ్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 06:00 PM