నాంపల్లిలో అగ్నిప్రమాదం.. సంచలన విషయాలు చెప్పిన ఫైర్ డీజీ..
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:18 PM
నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి కాల్ రాగానే రెండు నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకున్నామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. సెల్లార్‌లో ఫర్నిచర్ మెటీరియల్, రెగ్జిన్, కెమికల్స్ నిల్వ ఉంచారని చెప్పారు. వీటి వల్లే మంటల తీవ్రత అధికమైందన్నారు.
హైదరాబాద్, జనవరి 25: నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఇదే అంశంపై ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆయన.. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కాల్ రాగానే రెండు నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకున్నామని తెలిపారు. సెల్లార్‌లో ఫర్నిచర్ మెటీరియల్, రెగ్జిన్, కెమికల్స్ నిల్వ ఉంచారని చెప్పారు. వీటి వల్లే మంటల తీవ్రత అధికమైందన్నారు. ఈ మంటల కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని వివరించారు.
సెల్లార్‌లో మెటీరియల్ వల్లే మంటలు వ్యాపించాయని.. అందులో ఐదుగురు చిక్కుకున్నారని తెలిపారు. మెట్లపై కూడా మెటీరియల్ స్టోర్ చేయడంతో మంటలు అంటుకుని ఆ మార్గం సైతం మూసుకుపోయిందని పేర్కొన్నారు. మరోవైపు నుంచి బయటికి రావడానికి ఉన్న ర్యాంప్ మార్గం కూడా మూసుకుపోయింది. దీంతో లోపల ఉన్న వారు బయటకు రాలేక అక్కడే ఉండి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. సెల్లార్‌లో రేకుల షెడ్ నిర్మాణం చేపట్టారని.. అలా ఎలా నిర్మిస్తారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
సెల్లార్లు కేవలం పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్లార్లను గోదాములు, ఇతర అవసరాల కోసం వినియోగించకూడదని ప్రజలకు ఆయన సూచించారు. అలా చేసినట్లు అయితే.. భవన నిర్మాణ యజమానులు, షాపు ఓనర్స్‌పై ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో దాదాపు 200 మంది సిబ్బంది పాల్గొన్నారని డీజీ విక్రమ్ సింగ్ మాన్ వివరించారు.
ఈ భవనంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం శనివారం రాత్రంతా కష్టపడి సిబ్బంది పని చేశారని పేర్కొన్నారు. మొదటి మృతదేహం ఆదివారం ఉదయం 9:15 కి దొరికిందని చెప్పారు. రాత్రంతా మంటలు, పొగలను అదుపులోకి తెచ్చేందుకే సమయం పట్టిందని వివరించారు. బేస్‌మెంట్‌ను పూర్తిగా దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కావచ్చు లేదా సిగరెట్ కారణంగా అయి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.
కెమికల్స్ తీవ్రత అధికంగా ఉండడం వల్లే తమ సిబ్బంది లోపలికి వెళ్ళటం సాధ్యపడలేదన్నారు. మెట్ల మార్గం నుండి పైకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ ఒక ఐరన్ షట్టర్‌కు తాళం వేసి ఉందని.. దీని వల్లే వారు బయటికి రాలేక పోయారని తెలిపారు. ఇక బిల్డింగ్ కండిషన్ మంచిగానే ఉందన్నారు. ఈ భవనం నిర్మాణం సమయంలో ఫైర్ డిపార్ట్‌మెంట్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు.
బిల్డింగ్ పర్మిషన్ల సమయంలో ఇన్స్‌పెక్షన్‌కు అధికారులు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుందని.. ఆ కొద్ది రోజుల తర్వాత అక్రమంగా సెల్లార్లను దుర్వినియోగం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీలో చాలా వరకు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని డీజీ విక్రమ్ సింగ్ మాన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆదివారం.. రథసప్తమి రావడం అదృష్టం: మంత్రి అచ్చెన్నాయుడు
తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త వాహనాలపై శ్రీవారి దివ్య దర్శనం
For More TG News And Telugu News