Share News

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో మందుబాబుల ఘర్షణ.. బస్సు అద్దాలు ధ్వంసం చేయడంతో..

ABN , Publish Date - Apr 05 , 2026 | 01:25 PM

మద్యం మత్తులో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్‌తో యువకులు ఘర్షణకు దిగారు. రాళ్లతో బస్సు అద్దాలను పగలకొట్టారు. దీంతో బస్సు డ్రైవర్‌ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు.

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో మందుబాబుల ఘర్షణ.. బస్సు అద్దాలు ధ్వంసం చేయడంతో..

హైదరాబాద్, ఏప్రిల్ 05: మద్యం మత్తులో ఉన్న యువకులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. రాళ్లతో బస్సు అద్దాలను పగలకొట్టారు. దాంతో బస్సు డ్రైవర్‌ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున బర్కత్‌పురా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పటాన్ చెరువు నుంచి కోఠికి బయలుదేరింది.


మాదాపూర్‌లో ఈ బస్సును టీఎస్ 07, ఎఫ్‌జీ 7272 ఆడి కారు ఓవర్ టేక్ చేసింది. అనంతరం రహదారిపై బస్సుకు అడ్డంగా కారును ఆపారు. కారులోని యువకులు బస్సు డ్రైవర్ మొయినుద్దీన్‌తో ఘర్షణకు దిగారు. అక్కడితో ఆగకుండా.. రాళ్లు విసిరి బస్సు అద్దాలు పగలకొట్టారు. యువకులు విసిరిన రాయి.. రహదారిపై వెళ్తున్న వాహనదారుడికి తగిలి.. తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం సదరు యవకులు అక్కడి నుంచి కారులో పరారయ్యారు.


బస్సు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు యువతి కూడా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటన స్థలంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారి కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేసినట్లు మాదాపురం పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన వాహనదారుడిని అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 05 , 2026 | 01:50 PM