Share News

ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు మాకే పట్టం కట్టారు: భట్టి విక్రమార్క..

ABN , Publish Date - Feb 13 , 2026 | 08:44 PM

కాంగ్రెస్ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విశ్వసించి రాష్ట్ర ప్రజలు గెలిపించారన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రతిపక్ష పార్టీలు గాలి కబుర్లు, కట్టు కథలు ఎన్ని చెప్పినా ప్రజలు తమవైపే నిలిచారన్నారు.

ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు మాకే పట్టం కట్టారు: భట్టి విక్రమార్క..
Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 116 మున్సిపాలిటీల్లో 83 స్థానాలను స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ గెలిచిందని స్పష్టం చేశారు. ఓట్లు వేసి విజయం వైపు నడిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.


ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విశ్వసించి రాష్ట్ర ప్రజలు గెలిపించారన్నారు. ప్రతిపక్ష పార్టీలు గాలి కబుర్లు, కట్టు కథలు ఎన్ని చెప్పినా ప్రజలు తమవైపే నిలిచారన్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ప్రచారం చేశారని ఆగ్రహించారు భట్టి. ప్రజలు అన్ని అంశాలు గమనించారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి విజయం అందించారని చెప్పుకొచ్చారు. గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు ఉపముఖ్యమంత్రి.


116 మున్సిపాలిటీల్లో 83 స్థానాలను కాంగ్రెస్ గెలిచిందని.. స్వతంత్ర అభ్యర్థులు సైతం కాంగ్రెస్ వైపే వస్తున్నారని చెప్పారు. హస్తం పార్టీకే వారంతా మద్దుతు ఇస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ సమాచారం ప్రకారం 90 నుంచి 94 స్థానాలు గెలువబోతున్నట్లు జోస్యం చెప్పారు భట్టి. రెండు, మూడు దశాబ్దాల్లో భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారని చెప్పుకొచ్చారు. 5 కార్పొరేషన్లలోనూ గెలిచామని.. రెండు కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవుపలికారు. మీడియాలో కనపడేందుకు మాత్రమే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు.

Updated Date - Feb 13 , 2026 | 09:37 PM