మళ్లీ ఎన్నికల్లో కొట్లాడుతా.. గెలిచి తీరుతా
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:05 AM
దానం నాగేందర్ అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఖైరతాబాద్ సీటు ఖాళీగా ప్రకటిస్తే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా
సుప్రీంకు వెళ్లడంపై ఆలోచించలేదు
ప్రజాతీర్పుకే ప్రాధాన్యమిస్తా
పోరాటాలు చేయడం నాకేమీ కొత్త కాదు: దానం
బంజారాహిల్స్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో పోరాటాలు, యుద్ధాలు చేయడం తనకు కొత్తేమీ కాదని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల్లోకి వెళ్లి విజయం సాధిస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పుపై శుక్రవారం బంజారాహిల్స్‌లోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పారు.
షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల బరిలో తలపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. ‘‘యుద్ధాలు చేస్తూనే ఇక్కడిదాకా వచ్చా.. పోరాటం అలవాటే... మళ్లీ ఎన్నికల్లో కొట్లాడతా.. గెలిచి తీరుతా’’ అని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానిపై ఇంకా ఏమీ ఆలోచించలేదని చెప్పారు. ఎన్నికల బరిలో దిగి ప్రజాతీర్పు కోరడానికే తాను ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారన్న మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
అనర్హత వేటు
అప్పీలుకా.. ఉప ఎన్నికకా?