Share News

రాజగోపాల్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి ఫోన్‌!

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:48 AM

సీఎం రేవంత్‌రెడ్డి పాలనా తీరు, నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వరుసగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగింది.

రాజగోపాల్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి ఫోన్‌!

  • వివాదంపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌ ఆరా

  • రాష్ట్ర ఇన్‌చార్జి సందీప్‌తో రేపు భేటీ కావాలని ఆదేశం

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి పాలనా తీరు, నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వరుసగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌.. ఆయనకు ఫోన్‌ చేసి ఇటీవలి పరిణామాలపై ఆరా తీశారు. సోమవారం రాష్ట్ర కాంగ్రెస్‌ నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్‌తో సమావేశం కావాలని ఆదేశించారు. తొలుత తన నియోజకవర్గానికి నిధులు కేటాయించడం లేదంటూ విమర్శలు గుప్పించిన రాజగోపాల్‌రెడ్డి.. క్రమంగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి, భాష, ప్రభుత్వ పని తీరు బాగా లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలపై సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.


‘మంచిని మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి.. కానీ. మా వాళ్లలో కొందరికి ఎర్రి కుక్క కరిచినట్టుంది. చెడును మైకులో చెబుతున్నారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత కూడా రాజగోపాల్‌రెడ్డి వెనక్కి తగ్గలేదు. అహంకారంతో మాట్లాడవద్దని, హామీల అమలుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మరో వైపు, రాజగోపాల్‌రెడ్డి విమర్శలకు సంబంధించిన వీడియోలు, నివేదికలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ అధిష్ఠానానికి పంపారు.


ఈ పరిణామాలను గమనించిన హైకమాండ్‌... నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇన్‌చార్జిగా నియమితులైన సందీప్‌ ఆదివారం రాష్ట్రానికి రానుండగా.. సోమవారం ఆయనతో భేటీ కావాలని రాజగోపాల్‌రెడ్డికి సూచించింది. ఈ భేటీలో రాజగోపాల్‌రెడ్డికి అధిష్ఠానం ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. అయితే, ఈ భేటీలో తన అభిప్రాయాలు, పార్టీ నాయకత్వంపై ఉన్న అసంతృప్తి, నియోజకవర్గ సమస్యలను ఇన్‌చార్జి దృష్టికి తీసుకెళ్తానని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌‌స్టర్ అరెస్టు

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..

Updated Date - Nov 22 , 2026 | 06:48 AM