Share News

‘నీ పో మోనే విజయా..!’

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:22 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాలో కేరళ వెళ్లిన రేవంత్‌ రెడ్డి...

‘నీ పో మోనే విజయా..!’

  • కేరళలో సీఎం రేవంత్‌ ఎన్నికల ప్రచారం

  • మోహన్‌లాల్‌ పంచ్‌ డైలాగ్‌తో సీఎం పినరయి విజయన్‌కు సెటైర్‌

  • ఎల్డీఎఫ్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే..

  • నరేంద్ర మోదీ, విజయన్‌లను ఓడిస్తేనే మంచి రోజులని వ్యాఖ్య

  • హస్తానికి ఓటేస్తే పాత కేరళను చూపిస్తామని రేవంత్‌రెడ్డి హామీ

  • ఎర్నాకుళం రోడ్‌ షోలో పొంగులేటి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాలో కేరళ వెళ్లిన రేవంత్‌ రెడ్డి... ‘నీ పో మోనే విజయా..!’ (విజయన్‌ నువ్వు దిగిపో) అంటూ ప్రముఖ సినీనటుడు మోహన్‌లాల్‌ పంచ్‌ డైలాగ్‌ను సీఎం పినరయి విజయన్‌కు అన్వయించి పలికి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కేరళలోని నేమం సహా పలు నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్‌ రెడ్డి.. ఎల్డీఎఫ్‌కు ఓటు వేేస్త బీజేపీకి వేసినట్లేనని పేర్కొన్నారు. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని మోదీ.. తిరువనంతపురం కమ్యూనిస్టు పినరయి విజయన్‌ను ఓడిస్తేనే కేరళకు మంచిరోజులు వస్తాయన్నారు. కేరళలో ఎల్డీఎఫ్‌, బీజేపీ మధ్య ఒప్పందాలు ఉన్నాయని, మోదీ, విజయన్‌లవి భిన్న భావజాలాలైనా భావాలు మాత్రం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. నేమం నియోజకవర్గంలో యూడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ శబరీనాథన్‌ తరఫున పూంథురలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ను కేరళలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గిసింది యూడీఎఫ్‌ అన్నారు. కేరళలో జాతీయ రహదారులు సహా పలు అభివృద్థి పనులు నిలిచిపోయినా సీఎం పినరయి విజయన్‌ ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. కేరళ ప్రజలు బీజేపీ, ఎల్డీఎఫ్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, సీపీఎంల మధ్య రహస్య అవగాహన ఉందని, అందుకే సీపీఎం వాళ్లపై ఎటువంటి కేసులూ ఉండవని ఆరోపించారు. దేశంలోని ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐలతో వేధించే బీజేపీ ప్రభుత్వం.. విజయన్‌ సర్కారుపై మాత్రం ఈగ వాలనీయట్లేదన్నారు. బీజేపీ, ఎల్‌డీఎఫ్‌ బయటకు పోటీ పడుతున్నట్టు కనిపించినా, అది ఉత్తుత్తి పోటీనేనన్నారు. కేరళ సమగ్రాభివృద్థి యూడీఎఫ్‌ లక్ష్యమన్నారు. విద్యావంతులైన ఎందరో మలయాళీలు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని.. వారికి స్థానికంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు కేరళ సమగ్రాభివృద్థికి యూడీఎఫ్‌ ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్‌ తెలిపారు. హస్తం పార్టీకి ఓటేస్తే పాత కేరళం ఏమిటో మళ్లీ చూపిస్తామని హామీ ఇచ్చారు. డెవల్‌పమెంట్‌ విత్‌ డిగ్నీటీతో ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


కాంగ్రెస్‌ సీఎంలవి నిష్కళంక రాజకీయాలు...

సామాజిక ప్రగతి, అభివృద్థి, అక్షరాస్యతలో కేరళ ఎప్పటినుంచో దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందంటే.. అందుకు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో జరిగిన కృషే కారణమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. విద్యా, అవగాహన, సామాజిక చైతన్యంలో కేరళం దేశానికి అప్పటికీ, ఇప్పటికీ నమూనాగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకు గతంలో కాంగ్రెస్‌ సీఎంలు కరుణాకరన్‌, ఊమెన్‌ చాందీ, ఏకే ఆంటోనీల కృషి ప్రధాన కారణమని కొనియాడారు. కరుణాకరన్‌ కేరళలో అభివృద్థికి బాటలు వేశారని, ఊమెన్‌ చాందీ సంక్షేమం-అభివృద్థి రెండింటికీ సమప్రాధాన్యం ఇచ్చారని, ఏకే ఆంటోనీ నిజాయతీకి నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కేరళంకు గౌరవం, నమ్మకం, పరిపాలనా స్థిరత్వం వచ్చిందన్నారు. ఇక, 12ఏళ్లుగా ఢిల్లీలో, పదేళ్లుగా కేరళంలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోదీ, కేరళంలో విజయన్‌ ‘డబుల్‌ ఫెయిల్యూర్‌’గా నిలిచారని విమర్శించారు. మోదీ, విజయన్‌ సిద్దాంతాలు వేరైనా వైఫల్యాలు ఒకేలా ఉన్నాయన్నారు. సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్థి మార్గంలో పయనిస్తోందని.. కేరళం కూడా అలానే ముందుకు వెళ్లాలని తన ఆకాంక్ష అని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. కేరళం అభివృద్థికి రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేతలు బిజీబిజీ

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు.. ప్రస్తుతం కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో బిజీబిజీ అయ్యారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. తిరువనంతపురం, అలప్పుజ, ఎర్నాకుళంలలో బుధవారం జరిగిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం తిరువనంతపురంలోని ఎస్‌ఎం లాక్‌ జంక్షన్‌ నుంచి మట్టతార వరకు జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న సీఎం రేవంత్‌.. భారతన్నూర్‌లో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. పూవాచల్‌లో రోడ్‌షో నిర్వహించిన ఆయన సాయంత్రం 4 గంటలకు అలప్పుజలో కార్నర్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. అనంతరం ఎర్నాకుళంలో ఎన్నికల ప్రచారం చేశారు. గురువారం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రాత్రికి తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు. కాగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మంత్రి పొంగులేటి. ఎర్నాకుళం రోడ్‌షోలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఇక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు బుధవారం వెళ్లారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా బుధవారం పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లోనూ పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కేరళ, పుదుచ్చేరి ఎన్నికలకు పార్టీ పరిశీలకులుగా వెళ్లి ప్రస్తుతం అక్కడే మకాం వేశారు.


విజయన్‌.. ఇక దిగిపో

మోహన్‌లాల్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా నరసింహంలో బహుళ ప్రాచుర్యం పొందిన ఓ డైలాగ్‌ను కేరళ సీఎం పినరయి విజయన్‌కు అన్వయించి ఎన్నికలో ప్రచారంలో చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి కార్యకర్తలను ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో నీ ‘పో మోనె దినేషా’ అంటూ మోహన్‌లాల్‌ ఓ డైలాగ్‌ చెబుతారు. దానిని విజయన్‌కు అన్వయించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ‘‘ నీ పో మోనె విజయా..! యువర్‌ టైమ్‌ ఈజ్‌ ఓవర్‌! యువర్‌ ఎక్స్‌పైరీ డేట్‌ ఈజ్‌ ఓవర్‌. యు డోంట్‌ హావ్‌ ఎనీ టైం టు కంటిన్యూ’’ అంటూ డైలాగ్‌ పేల్చారు. మోహన్‌లాల్‌ స్టైల్లో ‘‘ నీ సమయం.. ఎక్స్‌పైరీ డేటూ అయిపోయింది.. నువ్వు సీఎంగా కొనసాగడానికి ఇక సమయం లేదు. విజయన్‌.. ఇక నువ్వు దిగిపో’’ అంటూ డైలాగ్‌ కొట్టడంతో కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ సీఎం అంటూ కార్యకర్తలు నినదించారు.

Updated Date - Apr 02 , 2026 | 03:22 AM