అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చదువుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Aug 14 , 2026 | 07:27 PM
చదువుతోనే ఆత్మగౌరవం, గుర్తింపు లభిస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి స్ఫూర్తితో విద్యార్థులు చదుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్: చదువుతోనే ఆత్మగౌరవం, గుర్తింపు లభిస్తాయని, విద్య ఒక్కటే తలరాతలను మార్చే మార్గమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ (శుక్రవారం) నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒకవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మరోవైపు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జ్యోతిబా ఫూలే విగ్రహాలను ఆవిష్కరించుకోవడం గర్వకారణమని రేవంత్ పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్ చౌరస్తా ఇప్పుడు అద్భుతంగా మారిందని చెప్పారు. 150 ఏళ్ల క్రితమే జ్యోతిబా ఫూలే చదువే ఏకైక మార్గమని చాటిచెప్పారని, తాను చదువుకోవడంతో పాటు తన సతీమణి సావిత్రిబాయి ఫూలేను చదివించి ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇంతకాలం తర్వాత కూడా ఫూలేను ఆదర్శ పురుషుడిగా గుర్తిస్తున్నామంటే ఆయన ఆలోచనల గొప్పతనం అర్థమవుతోందని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం జ్యోతిబా ఫూలే ఆలోచనలను కొనసాగిస్తోందని తెలిపారు. కుల నిర్మూలన, సామాజిక చైతన్యం సాధించాలంటే అందరూ కలిసి చదువుకోవడం, జీవించడం అవసరమన్నారు. అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను తీసుకొస్తున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని, నర్సరీ నుంచి విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. వారి స్ఫూర్తితో విద్యలో రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పారదర్శకంగా అమలు చేస్తామని, ముందుగానే నిధులు అందించే విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు.
ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఏ కళాశాలా అడ్డుకోలేని విధంగా చర్యలు చేపడుతున్నామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ ఒక్కటే ఉద్యోగానికి సరిపోదని ఆయన స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు నైపుణ్యాలను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్స్ ఉంటేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నర్సింగ్ రంగంలో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని, విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. 2024లో టాటా సంస్థతో కలిసి 119 నియోజకవర్గాల్లో ఏటీసీలను ఏర్పాటు చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయా కేంద్రాల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ ఇస్తున్నామని చెప్పారు.
విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే కేవలం మార్కులు, డిగ్రీలు సరిపోవని, నైపుణ్యాలూ అవసరమని అన్నారు. గ్రూప్-1 నియామకాల్లో బీసీలకు పెద్ద సంఖ్యలో అవకాశాలు లభించాయని తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. క్రీడల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. సిరాజ్, నిక్కజ్, దీప్తి వంటి క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తారో, తానూ అంతే బాధ్యతగా ఆలోచిస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. క్రీడల్లో రాణించి పతకాలు తీసుకొస్తే నగదు నజరానాలతో పాటు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని చెప్పారు.
సామాజిక చైతన్యంతో తమ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. మాదిగలు దశాబ్దాలుగా పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామని చెప్పారు. దేశంలో బీసీ జనగణన చేపట్టడానికి ఎవరూ ధైర్యం చేయలేదని, బ్రిటిష్ పాలన తర్వాత తొలిసారిగా బీసీల లెక్క తేల్చామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడాదిలోనే కులగణన పూర్తి చేశామని తెలిపారు. కులగణనలో కొందరు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు పాల్గొనకుండా వ్యతిరేకించారని ఆరోపించారు. బలహీన వర్గాలకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించాలంటే వారి జనాభా లెక్కలు తెలియాలని, అందుకే కులగణన చేపట్టామని సీఎం వివరించారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం ప్రజలను గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని చెప్పిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీసీలు చదువుకుని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కావద్దా? అని ప్రశ్నించారు. 'చదువు ఒక్కటే తలరాతలను మారుస్తుంది. చదువు ఒక్కటే పరిష్కారం.. అదే మార్గం' అని సీఎం అన్నారు. తెలంగాణను ప్రపంచ పటంలో నిలపడానికి విద్యే మార్గమని పేర్కొన్నారు. జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో చట్టసభల్లోకి రావాలని, డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని ఆకాంక్షించారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించే బాధ్యత తనదేనన్నారు. 'మీ బంగారు భవిష్యత్తు కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తా. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలి' అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టరు?: ఎంపీ రఘునందన్ రావు..
ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..