Share News

CM Revanth: జిల్లాలు పునర్ వ్యవస్థీకరిస్తాం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 12 , 2026 | 04:34 PM

తెలంగాణలో గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలను రేషనలైజ్ చేయడానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమానికి డీఏ పెంపు, రూ.1.02 కోట్ల ప్రమాద బీమా పథకం త్వరలో అమలు చేస్తామన్నారు.

CM Revanth: జిల్లాలు పునర్ వ్యవస్థీకరిస్తాం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
CM Revanth Reddy on District Rationalization, DA Hike for Employees

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణలో గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను రేషనలైజ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీజీఓ (తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలనలో సమస్యలు సృష్టించిన ఈ జిల్లాల ఏర్పాటును సమీక్షించి సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్రంలోని పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతం చేయడానికి అవసరమన్నారు.

CM-Revanth-1.jpg


జిల్లాల ఏర్పాటులో తప్పులు: సీఎం విమర్శలు

గత ప్రభుత్వం అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వరంగల్, హనుమకొండ జిల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని.. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి త్వరలో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

ఈ కమిషన్ ఆరు నెలలపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ పై నివేదిక సమర్పిస్తుందని సీఎం చెప్పారు. అన్ని జిల్లాల్లో మండలాలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, విధివిధానాలు రూపొందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషన్ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ సారథులుగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. 'మా ప్రభుత్వ వారదులు.. సారథులు ప్రభుత్వ ఉద్యోగులే. ఆనాడు ప్రభుత్వం తప్పుడు పనులను ఉద్యోగులపై ఒత్తిడి చేసి అమలు చేయించింది. పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఫామ్ హౌజ్‌లో పడుకున్నారు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 'నేను అన్నగా వచ్చాను. ఇప్పుడు నేను 18 గంటలు పనిచేస్తున్నాను. ఈరోజు డీఏ ఫైల్ మీద సంతకం చేసి వచ్చాను. దీంతో ప్రభుత్వానికి రూ.227కోట్ల భారం పడుతుంది' అని రేవంత్ రెడ్డి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు.

ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రతీ ఉద్యోగికి రూ.1.02 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తాం. ఉద్యోగులు, ప్రభుత్వం వేరువేరు కాదు. ఇద్దరం కలిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి' అని సీఎం అన్నారు. అలాగే, భూములు, ఇసుక, GST సబ్సిడీలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని నిరోధిస్తే ప్రభుత్వ ఆదాయం మెరుగవుతుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నల్లమల సాగర్‌పై సుప్రీంలో ఊహించని పరిణామం..

భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 05:08 PM