Share News

తల్లిని అవమానిస్తే.. కొడుకు రక్తం మరగదా?

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:27 AM

‘‘కన్నతల్లిని అవమానకరంగా మాట్లాడితే.. ఏ కొడుకుకైనా రక్తం మరగదా? స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మనసు గాయపడేలా బీఆర్‌ఎస్‌ వ్యవహరించింది. ఇది వ్యక్తిగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు కలిగిన అవమానం కాదు. మాతోపాటు సభకు, యావత్‌ తెలంగాణ సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

తల్లిని అవమానిస్తే.. కొడుకు రక్తం మరగదా?
Revanth Reddy

  • స్పీకర్‌ను దూషించిన ఎమ్మెల్సీని బర్తరఫ్‌ చేయాల్సిందే

  • కేసీఆర్‌ క్షమాపణ చెప్పాల్సిందే

  • దళితులకే కాదు.. తెలంగాణ సమాజానికే అవమానం

  • బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టుకతోనే దళితులకు వ్యతిరేకం

  • అసెంబ్లీలో సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘కన్నతల్లిని అవమానకరంగా మాట్లాడితే.. ఏ కొడుకుకైనా రక్తం మరగదా? స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మనసు గాయపడేలా బీఆర్‌ఎస్‌ వ్యవహరించింది. ఇది వ్యక్తిగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు కలిగిన అవమానం కాదు. మాతోపాటు సభకు, యావత్‌ తెలంగాణ సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్పీకర్‌ పదవి అనేది ఒక అత్యున్నత స్థానమని, సభాపతిని గౌరవించటం మన సంప్రదాయమని, అలాంటి స్పీకర్‌పై సభ్య సమాజం తలదించుకునేలా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు వ్యాఖ్యలు చేయటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను సభకు జరిగిన అవమానంగా భావించి సోమవారం అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అనుచిత భాషతో దూషించటం క్షమించరాని నేరమని మండిపడ్డారు. సభాపతిని, ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడారని, ఇది దళితులకు మాత్రమే జరిగిన అవమానం కాదని, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కలిగిన అవమానమని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఇది చీకటి రోజని అన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టుకతోనే దళితులకు వ్యతిరేకం. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, దళిత బంధు ఇస్తామని నమ్మించి.. ఓట్లు వేయించుకొని కేసీఆర్‌ మోసం చేశారు. నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దళితులను లారీలతో తొక్కించి చంపారు. ఖమ్మంలో గిరిజనులకు బేడీలు వేయించి నడిబజార్లో నడిపించారు. సీఎల్పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్కను ప్రధాన ప్రతిపక్ష నేత పదవి నుంచి తొలగించారు. అందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను లోబరుచుకొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. దళితుడిని ప్రతిపక్ష నేతగా చూడలేకపోయారు’’ అని గుర్తు చేశారు. ఫాంహౌజ్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో భాష గురించి మాట్లాడారని, ఒకవేళ ఆయన సభకు వస్తే.. చట్టసభల్లో మాట్లాడే భాష, ప్రజా వేదికల్లో మాట్లాడే భాషపై చర్చ పెడదామని భావించానని తెలిపారు. భాషపై స్వీయ నియంత్రణ పెట్టుకోవాలని, సభ్యులు అనాగరికంగా మాట్లాడటాన్ని నియంత్రించాలని, విశృంఖలత్వం, అడ్డగోలుతనం, ఏం మాట్లాడినా చెల్లుతుందనే అహంకారం పోవాలని స్పష్టం చేశారు. ‘‘నేను 20 ఏళ్ల రాజకీయ జీవితంలో రాజ్యసభ మినహా అన్ని చట్టసభలు చూశాను. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని సభల్లో ప్రాతినిధ్యం వహించాను. కానీ, ఇంత జుగుప్సాకరమైన భాష ఏ సందర్భంలోనూ, ఎవరూ మాట్లాడలేదు. స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు మాట్లాడిన భాష ఎవరూ మాట్లాడిన దాఖలాలు లేవు. ఇలాంటి భాషను మాట్లాడే వారిని రాజకీయాలకతీతంగా ముక్తకంఠంతో ఖండించాలి. ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాలి’’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం సంయమనం పాటిస్తే.. దానిని చేతకానితనం అనుకుంటున్నారని, అదిరించి, బెదిరించి వ్యవస్థలను లొంగ దీసుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుతోపాటు వారికి నాయకుడైన కేసీఆర్‌ కూడా ఇందుకు బాధ్యత వహించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సదరు ఎమ్మెల్సీతో తక్షణమే రాజీనామా చేయించాలని, కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ సభ్యుడు రాజీనామా చేయకపోతే.. మండలి చైర్‌పర్సన్‌ స్పందించి తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులతోపాటు బీఆర్‌ఎ్‌సలో ఉన్న ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు.ముఖ్యమంత్రి అయినా, ప్రతిపక్ష నేత అయినా, శాసన సభ్యుడు అయినా... సభలో స్పీకర్‌కు అందరూ సమానమేనని, అది గుర్తెరిగి నడుచుకోవాలని హితవు పలికారు. స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంటే బీజేపీ సభ్యులు అడ్డుకోవటం వారి చీకటి మిత్రులను కాపాడుకునేందుకేనని ముఖ్యమంత్రి ఆరోపించారు.


అసెంబ్లీలో సెంట్రల్‌ హాల్‌ను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శాసనసభ లాబీల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘సెంట్రల్‌ హాల్‌’ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందుగానే దీనిని వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభించారు. ఈ హాల్‌కు శాసనసభ మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం హాల్‌లో ప్రజాప్రతినిధులు కూర్చుని అల్పాహార విందును స్వీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..
రణరంగం

రాష్ట్రంలో ‘సర్‌’ గడువు పొడిగింపు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 04:27 AM