Share News

భవిష్యత్తు తరాలు క్షమించవు

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:25 AM

మూసీ నదిని అభివృద్ధి చేసి పర్యాటక, అభివృద్ధి కేంద్రంగా తయారు చేసుకోవాల్సిన అవసరముందని, సమాజ పరిణామ క్రమంలో వస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు......

భవిష్యత్తు తరాలు క్షమించవు

  • చరిత్రను ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ తిరగరాయలేం

  • తెలంగాణను గొప్ప సంపన్న రాష్ట్రంగా నిలబెట్టేందుకే ఈ ప్రాజెక్టు

  • కళేబరాలు, డ్రైనేజీ నీరు, ఫార్మా కాలుష్యంతో విషపు కూపంగా మూసీ

  • నదీ పరీవాహకంలోని ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ విషయంలోనూ ఇబ్బందులు

  • ఇది నివాస యోగ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం తేల్చింది

  • ఇళ్లు కోల్పోయిన వాళ్లకు ఇళ్లు ఇచ్చాం.. పరిహారం సంపూర్ణంగా అందిస్తాం

  • గాంధీ విగ్రహం ఖర్చు రూ.70-75 కోట్లే.. మూసీకి 6500-7500 కోట్లే

  • కడుపులో కుళ్లు, మాటల్లో విషం, చూపుల్లో పగతో దీనిని అడ్డుకుంటున్నారు

  • రేవంత్‌ దీనిని పూర్తి చేస్తే తాము మళ్లీ అధికారంలోకి రాలేమనే దుగ్ధతోనే

  • ‘మూసీ ప్రాజెక్టులపై వివరణ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిని అభివృద్ధి చేసి పర్యాటక, అభివృద్ధి కేంద్రంగా తయారు చేసుకోవాల్సిన అవసరముందని, సమాజ పరిణామ క్రమంలో వస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. చరిత్రను ఇప్పుడు తిరగరాయకపోతే ఎప్పటికీ రాయలేమన్న విషయం మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్న మేధావులకు అర్ధం కావడం లేదా!? అని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల కోసం చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో ఏ పేదవాడికి అన్యాయం జరగనివ్వబోమని, ఏ పేద వ్యక్తిని నిరాశ్రయుడిని చేయబోమని, ఎవరి ఆస్తులను గుంజుకోబోమని స్పష్టం చేశారు. పేదలకు నష్టం, ఇబ్బంది కలిగించడానికి గానీ, రియల్‌ ఎస్టేట్‌ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజా ప్రభుత్వం పని చేయడం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణను గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టేందుకే పని చేస్తుందన్నారు. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం, దా నికయ్యే ఖర్చు సహా ప్రాజెక్టు వివరాలను తెలిపేందుకు హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సీఎం రేవంత్‌ మాట్లాడారు. ‘‘మూసీ పునరుజ్జీవనం విషయంలో నాకు కూడా సానుభూతి ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా పరిధిలో కాకుండా కింది భాగాన ఉన్న నల్గొండ జిల్లా గురించి ఎందుకు ఆలోచించడం లేదు!? పశువుల కళేబరాలు, ఫార్మా రంగం కాలుష్యం, నగర డ్రైనేజీ నీరు, ఆత్మహత్యలు చేసుకున్న వారి కళేబరాలు తదితరాల భరించలేని కంపుతో మూసీ విషపు కూపంగా మారింది. ఇది నల్లగొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.

1.jpg


భువనగిరి, ఆలేరు సహా నదీ ప్రాంతంలో నివసిస్తున్న ఆడపిల్లలు పెళ్లిళ్లు అయిన తరువాత ప్రెగ్నెన్సీ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పండే పంటలు విషపూరితం. మూసీ ప్రాంతం నివాసయోగ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం కూడా తేల్చింది. మూసీ ఒకప్పుడు ఎంతో గొప్ప నది. ఇప్పుడు విషంతో నిండి కాల గర్భంలో కలిసిపోతోంది. ఎంతో చరిత్ర కలిగిన మూసీని రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం, ఉద్ధేశపూర్వకంగా కాలగర్భంలో కలిపేద్దామా, లేదా నగర చరిత్రను పున రుజ్జీవింప చేసుకుందామా!?’’ అని ప్రశ్నించారు. నగరంలో కూడా మూసీ పరీవాహక ప్రాంతంలో కుటుంబాలు నివసించే పరిస్థితి లేదని, పిల్లలు బడులకు వెళ్లేందుకు ఆస్కారం లేదని వివరించారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాల్సిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితిని మార్చాలని ప్రయత్నిస్తుంటే బుల్డోజర్లు, జేసీబీలు తీసుకుని వస్తున్నారని కొందరు.. మూసీ బ్యూటిఫికేషన్‌ను లూటిఫికేషన్‌ అని మరికొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ తమవైపు ఏమైనా తప్పులుంటే సూచించాలని, వాటిని చెబితే.. మార్చుకుని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మూసీని ప్రక్షాళన చేయకపోతే నల్లగొండ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని, పేదవారిని నిరాశ్రయులను చేయాలని గానీ, పేదవారితో యుద్ధం చేయాలని గానీ ప్రభుత్వం అనుకుంటుందా!? అని ప్రశ్నించారు. ప్రపంచంలో నదీ జలాల వెంటే అభివృద్ధి జరిగిందని, లండన్లోని థేమ్స్‌, సింగపూర్‌, హాట్సన్‌, సబర్మతి సహా చాలా ప్రాంతాలను సందర్శించానని, వాటి స్ఫూర్తితోనే మూసీ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నా.. మనం అభివృద్ధి నిరోధకులుగా మారితే.. భవిష్యత్తు కోసం ఒక బృహత్‌ ప్రణాళిక లేకపోతే భవిష్యత్తు తరాలు క్షమించబోవని అన్నారు.


గాంధీ ఐడియాలజీ కోసమే..

మూసీ ప్రాజెక్టు ఖర్చు, గాంధీ విగ్రహం నిర్మాణాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. గాంధీ విగ్రహానికి రూ.70-75 కోట్ల వరకే ఖర్చవనుంద ని, మూసీ ప్రాజెక్టు మొత్తం ఖర్చు కూడా రూ.6,500 కోట్ల నుంచి రూ.7,500 కోట్ల వరకేనని స్పష్టంచేశారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్‌ విగ్రహం కోసం రూ.220 కోట్లు ఖర్చు చేశారు. అంబేడ్కర్‌ ఐడియాలజీ అందరికీ అవసరం. అలాగే, శాంతితో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన గాంధీ ఐడియాలజీ కూడా భవిష్యత్తు తరాలకు కావాలి. అందుకే గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం’’ అని వివరించారు. మహాత్మగాంధీ స్ఫూర్తిని రగిలించడానికి కన్యాకుమారి దగ్గర ఆయన అస్తికలను పెట్టారని, తద్వారా ఆ ప్రాంతాన్ని చూడడానికి ఎంతోమంది వస్తున్నారని, మూసీ, ఈసా కలిసే బాపూఘాట్‌ కూడా అలాంటిదేనని సీఎం రేవంత్‌ వివరించారు. అసలు బాపూ ఘాట్‌ ఉందా అన్నట్టు ప్రస్తుతం పరిస్థితులున్నాయని చెప్పారు. 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించి, మూసీలో 3 టీఎంసీలను ప్రవహింపచేసి.. మిగిలిన నీటిని తాగునీరుగా వాడాలని నిర్ణయించామని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ నిర్మాణ సమయంలో ఎంతో మందికి పరిహారం ఇచ్చారని, ఇప్పుడు మూసీ ప్రాజెక్టులో కూడా పరిహారం సంపూర్ణంగా అందిద్దామని అనుకుంటున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. దాదాపు 10 వేల కుటుంబాలు మూసీ పరిధిలో ఉన్నాయని, ఎవరికి ఎంత ఇవ్వాలనే దానిపై చర్చ చేద్దామని అన్నారు. ‘‘మూసీ పరీవాహకం పరిధిలోని ప్రతి పేదవాడి వివరాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే 10,500 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయించాం. ఈ ప్రాజెక్టు విషయంలో మానవీయ కోణాన్ని పరిగణనలోకి తీసుకున్నాం’’ అని వివరించారు. ఇప్పుడు మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నవారు ఒక 3 నెలలపాటు అక్కడ నివసించగలుగుతారా అని ప్రశ్నించిన సీఎం ..ఇందుకు ఎవరైనా ముందుకొస్తే మూసీ కార్పొరేషన్‌ తరపున మొత్తం 55 కిలోమీటర్ల పరిధిలో రెండు వైపులా కలిపి కంటైనర్‌ ఇళ్లను ఇస్తానని చెప్పారు.


మళ్లీ అధికారం రాదేమోనని..

మూసీ ప్రాజెక్టు చేపట్టి, పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు మంచి పేరు వస్తుందని, దాంతో తాము రెండోసారి కూడా అధికారానికి దూరమవుతామని కడుపుల్లో కుళ్లు, మాటల్లో విషం, చూపుల్లో పగ పెట్టుకున్న కొంతమంది దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. కేవలం అబద్ధాలను ప్రచారం చేయడానికే వాళ్లు నెలకు కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మహాత్మ గాంధీ చెప్పినట్లు నేను చెడు చూడను. మాట్లాడను. కేవలం మంచివైపు ఉంటాను. మీలో ఒకడిగా ఉంటా. మీరు చెప్పిన సూచనల మేరకు ముందుకెళ్తా. అందరం కలిసి ప్రాజెక్టును మందుకు తీసుకెళ్దాం’’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నగర జనాభా 1.34 కోట్లని, 2050నాటికి దాదాపు 2.80 కోట్లకు చేరుతుందని, వారందరికీ మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఇప్పుడు తాము కొన్ని పాలసీలను తీసుకున్నామని, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాల మేరకు వాటిని మార్చుకుంటూ వస్తున్నామని చెప్పారు.

నేను పైకెళ్లాక నాతో ఏదీ రాదు

రాష్ట్ర ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో రాష్ట్ర సీఎంగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నానన్న రేవంత్‌ రెడ్డి.. భవిష్యత్తు తరాలకు ఏమీ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రానికి రెండో సీఎంగా ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు చాలా మంచిగా పూర్తి చేసుకున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మడంతోపాటు ఇతర మతాలను గౌరవిస్తాను. పైకెళ్లేటప్పుడు నాతో తీసుకెళ్లడానికి కాదు. పైకెళ్లాక బదిలీ చేసుకోవడానికి ఆర్టీజీఎస్‌ విధానం కూడా ఉండదు. ఏం చేసినా ఇక్కడే వదిలేసి వెళ్లాలి. అందుకే మనం చేసిన మంచైనా, చెడు అయినా ఇక్కడే మిగులుతుంది. నేను మంచి వైపు ఉండాలని అనుకుంటున్నాను’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 మందికిపైగా సీఎంలు పని చేసినా చాలా తక్కువ మందే గుర్తున్నారని, అందుకు కారణం వాళ్లు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులేనని చెప్పారు. నిజాంలాంటి వారి గురించి కూడా చర్చించుకుంటున్నామంటే వాళ్లు నిర్మించిన చార్మినార్‌, మొజాంజాహి మార్కెట్‌, గుల్జార్‌హౌస్‌, కబూతర్‌ ఖాన్‌, ఉస్మానియా, నిమ్స్‌, నిలోఫర్‌లాంటి ఆస్పత్రులు కారణమన్నారు. కానీ, అభివృద్ధి కోసం కేంద్రం రూపొందించిన చట్టాలకు మద్దతు ఇచ్చిన వారే వాటిని ఇక్కడ అభివృద్ధి చేద్దామంటే అడ్డుపడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైడ్రాను తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే విమర్శించారని, కానీ ఇటీవల హైడ్రా అభివృద్ధి చేసిన నల్లచెరువు సహా పలు నీటికుంటల ప్రారంభానికి వెళ్తే అందరూ ఎంతో ఆనందంగా స్వాగతించారని చెప్పారు. మూసీ ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు రంగాల నిపుణులు పాల్గొన్నారు.

3.jpg

Updated Date - Mar 14 , 2026 | 05:25 AM