Share News

మీరెలా జాతిపిత?

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:23 AM

ఈ మధ్య కొంతమంది వారికి వారే ‘తెలంగాణ జాతిపిత’ అని ప్రకటించుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

మీరెలా జాతిపిత?

  • మీరు ఏ ఆదర్శాల కోసం నిలిచారు?

  • నేరాలపై విచారణ వద్దనడం ఏమిటి?

  • పోలీసులు నోటీసులిస్తే తప్పుబడతారా?

  • మీ హయాంలో ఉద్యమకారులకు అవమానాలు

  • హక్కుల కోసం కొట్లాడినోళ్లు సర్వం కోల్పోయారు

  • మీకేమో వందల ఎకరాల ఫాంహౌ్‌సలు,రూ.వేల కోట్ల వ్యాపారాలు, పత్రికలు, టీవీలా?

  • ప్రజాస్వామ్యంలో నేరాలు చేసే స్వేచ్ఛ ఎవరికీ లేదు

  • రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోదీ కుట్ర

  • చదువుకున్న సర్టిఫికెట్‌ చూపించరెందుకు?

  • రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

  • జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి పురస్కారం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఈ మధ్య కొంతమంది వారికి వారే ‘తెలంగాణ జాతిపిత’ అని ప్రకటించుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులిస్తే.. తెలంగాణ జాతిపితకు నోటీసులిచ్చారంటున్నారని విమర్శించారు. ఆయన నిజంగా తెలంగాణ జాతిపిత అయితే.. ఆనాటి భారత జాతిపితలాగా ఏ ఆదర్శాల కోసం నిలిచారో చెప్పాలన్నారు. భారత జాతిపిత ఏదైనా పదవి తీసుకున్నారా? కుటుంబం కోసం ఏమైనా అడిగారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోమవారం జూబ్లీహిల్స్‌ లోట్‌సపాండ్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోదుడు రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ పురస్కారాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రదానం చేశారు. అంతకుముందు రావి నారాయణరెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు మొదలు తెలంగాణ సమాజాన్నంతా ఏకం చేసే బాధ్యత నిర్వర్తించిన ప్రొఫెసర్‌ కోదండరాం ఉద్యమకారుడు కాదా? అని ప్రశ్నించారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టించి మరీ పోలీసులతో ఈడ్చుకుపోయేంత నేరం ఆయనేం చేశారని నిలదీశారు. ‘‘మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా అవమానించారో మర్చిపోయారా? ఇప్పుడు మీ తలుపులు ఎవరూ బద్దలు కొట్టలేదే? చేసిన తప్పులకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు అంతే కదా! అధికార నివాసానికి వస్తామని అధికారులంటే ఫామ్‌హౌ్‌సకు వచ్చి రాసుకొమ్మంటారా? ఇదెక్కడి జాతిపిత విధానం?’’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు.


మానవతామూర్తి రావి నారాయణరెడ్డి..

రాచరిక పోకడలు, అరాచక శక్తులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధరైతాంగ పోరాటంలో నాయకత్వ స్థానాన నిలిచి పోరాడిన గొప్ప సాహసి రావి నారాయణరెడ్డి అంటూ సీఎం రేవంత్‌ కొనియాడారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేద ప్రజల కోసం 500 ఎకరాలు దానం చేసిన మానవతామూర్తి అని అన్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. పార్టీ, రాజకీయ పదవుల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన గొప్పనేత రావి నారాయణరెడ్డి అని శ్లాఘించారు. ఆయన త్యాగాలు ఆదర్శనీయమని, ఆయన ఔన్నత్యాన్ని భావితరాలకు చాటేలా మంచి కార్యక్రమాలు చేపట్టే బాధ్యత తమ ప్రభుత్వానిదని ప్రకటించారు. ‘‘ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ, స్వాతంత్య్రం, మానవ హక్కుల కోసం కొట్లాడిన చేగువేరా మొదలు రావి నారాయణరెడ్డి వరకు ఎంతోమంది సర్వం కోల్పోయారు. ఆస్తులు, అంతస్తులు త్యాగం చేశారు. అలాంటి త్యాగధనులను జాతిపితలుగా, ఉద్యమకారులుగా ప్రజలు కీర్తించారు. అంతేతప్ప.. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటిరి. వందల ఎకరాల ఫామ్‌హౌ్‌సలు మీకే వచ్చె. టీవీలు, పత్రికలు, వేలకోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చె. చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తిరి. కాంట్రాక్టులు మీరే పంచుకుంటిరి. ఇంత చేసిన తర్వాత మీరెట్లా జాతిపిత అయితరు? ఉద్యమకారుడెలా అయితరు?’’ అని రేవంత్‌ అన్నారు.

నేరాలను విచారించొద్దు అనడమేంటి?

‘‘ఒక అసెంబ్లీ స్థానంలో ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వనప్పుడు మీరు ప్రజల తిరస్కరణకు గురయ్యారు. దీన్ని అర్థం చేసుకోకుండా మీకు ఓట్లు వేయకుండా ప్రజలే తప్పు చేశారని వారిపై నిందలు మోపడానికి ప్రయత్నిస్తే... ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? ప్రజలు తిరస్కరించినందున హుందాగా ప్రజాక్షేత్రం నుంచి తప్పుకొంటామని ముందుకు వచ్చి ప్రకటిస్తే కొంతైనా మీకు గౌరవం నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటుంది కానీ, నేరపూరితమైన పనులు చేయడానికి, ఆ నేరాలను విచారించవద్దనడానికి స్వేచ్ఛ లేదు. అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజాస్వామ్యంలో విచారణ తప్పదు’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. శిబుసోరెన్‌, లాలూ ప్రసాద్‌, జయలలిత, యడ్యూరప్ప లాంటి మాజీ సీఎంలు విచారణ ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. చట్టాలకు ఎవరమూ అతీతులం కాదన్నారు. తాను హార్వర్డ్‌కు వెళ్లినా రాష్ట్ర రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నానని తెలిపారు.


రాజ్యాంగాన్నే రద్దు చేయాలన్న కుట్ర...

నాణేనికి రెండు వైపులు ఎలాగో.. ప్రజలకు కూడా కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు అంతే అవసరమని సీఎం రేవంత్‌ అన్నారు. కానీ, ప్రస్తుతం మోదీ లాంటి వాళ్లు ‘వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌ అంటున్నారని, ఈ పేరుతో వన్‌ పర్సన్‌ - వన్‌ పార్టీ విధానాన్ని దేశంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీ 400 సీట్లు అడిగింది రాజ్యాంగంలో మార్పులు తేవడానికి కాదని, రాజ్యాంగాన్నే రద్దు చేయడానికని ఆరోపించారు. అయితే ప్రజలు సింపుల్‌ మెజారిటీ కూడా ఇవ్వకుండా తెలివిగా వ్యవహరించి ఆ పార్టీని నియంత్రించారని తెలిపారు. ఇప్పుడు.. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాయాలన్న కుట్ర జరుగుతోందన్నారు. ‘‘ఈరోజు అనవసరమైనవి ఎన్నో అడుగుతున్నారు. మీ తాత ముత్తాతలు ఎక్కడ పుట్టారో ఆధారాలు చూపించమంటున్నారు. దీనిపై రాహుల్‌గాంధీ ఒకే ఒక్కటి అడిగారు. ‘మోదీగారూ మీరు చదువుకున్న సర్టిఫికెట్‌ చూపించండి’ అని. అది మాత్రం ఆయన చూపించరట. చదువుకున్నది నిజమైనప్పుడు సర్టిఫికెట్‌ చూపించానికి వచ్చిన సమస్య ఏంటి? మీరు చదువుకున్న సర్టిఫికెటే ఒక రహస్యమైనప్పుడు.. చదువురాని నిరుపేదలపై నిబంధనలు రుద్ది వాళ్ల ఓటు హక్కును కాలరాయాలని చూడడం దుర్మార్గం కాదా? రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి’’ అని రేవంత్‌ అన్నారు.

పరిమితుల్లేని భావప్రకటనా స్వేచ్ఛకు అనుమతి లేదు..

ఇప్పటివరకు తాను అందుకున్న పురస్కారాలన్నింటి కన్నా రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు అత్యంత విలువైనది, ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తున్నట్లు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ‘భారత రాజ్యాంగం - భావప్రకటనా స్వేచ్ఛ’ అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. రావి నారాయణరెడ్డి రాసిన ‘తెలంగాణ నగ్నసత్యం’ చారిత్రక పత్రంపై విశ్వవిద్యాలయాలు కేంద్రంగా పరిశోధన జరగాలన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు భావప్రకటనా స్వేచ్ఛ అని, అయితే పరిమితులు లేని భావప్రకటనా స్వేచ్ఛను అనుమతించలేదని చెప్పారు. ఇందుకు సంబంధించి 1951, 1963ల నాటి రాజ్యాంగ సవరణల్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి, సీపీఐ నాయకులు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్‌, నెల్లికంటి సత్యం, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రావి నారాయణరెడ్డి మనుమరాలు ప్రతిభారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2.jpg

Updated Date - Feb 03 , 2026 | 06:14 AM