Share News

50 శాతం పెంపు ఏ లెక్కన?

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:18 AM

కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉద్దేశపూర్వకంగానే అంతరాన్ని పెంచుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

50 శాతం పెంపు ఏ లెక్కన?

  • దక్షిణాది అవసరం లేని కేంద్ర పాలన దిశగా కుట్ర

  • ఉత్తరాది కోసమే లోక్‌సభ నియోజకవర్గాల పెంపు

  • బీజేపీలోనూ దక్షిణాది వివక్షే.. సొంత నేతలకే అవమానం

  • హోంశాఖ వంటి పదవులు దక్షిణాదికి ఎందుకివ్వరు?

  • వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిని ఎందుకు చేయలేదు?

  • పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఢిల్లీ నుంచి ఎందుకు పంపించేశారు?

  • ఢిల్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉద్దేశపూర్వకంగానే అంతరాన్ని పెంచుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం ప్రతిపాదించిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాల ఉనికిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. దీనిపై ఉమ్మడి పోరాటానికి దక్షిణాది రాష్ట్రాల సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50శాతం సీట్ల పెంపు వెనుక భారీ రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా సీట్లు పెంచడం ద్వారా.. దక్షిణాది రాష్ట్రాల మద్దతు ఏమాత్రం అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేలా బీజేపీ వ్యూహరచన చేస్తోందని పేర్కొన్నారు. దీనితో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది నేతల ప్రాతినిధ్యం, ప్రభావం నామమాత్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న నిష్పత్తి ప్రకారమే సీట్ల పెంపు జరగాలే తప్ప, దక్షిణాదిని శిక్షించేలా ఉండకూడదని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో దక్షిణాది నేతలను బీజేపీ ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘‘సీనియర్‌ నేత వెంకయ్యనాయుడిని ఢిల్లీ నుంచి ఎందుకు ఖాళీ చేయించారు? ఆయనను ఎందుకు రాష్ట్రపతి చేయలేదు? మొదటి నుంచీ పార్టీలో ఉన్న దక్షిణాది నేతలకు కేంద్ర హోం శాఖ వంటి కీలక పదవులు ఎందుకు ఇవ్వడం లేదు?’’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ హయాంలో టాప్‌-10 పదవుల్లో దక్షిణాది వారికి చోటు దక్కలేదని, ఇది రాజకీయ వివక్షకు నిదర్శనం కాదా? అని నిలదీశారు.


సబర్మతికి సహకారం.. మూసీకి అడ్డంకులా?

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటయ్యాయని రేవంత్‌ విమర్శించారు. మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా కేవలం గుజరాత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్త మెచ్చుకుంటారని.. హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టు చేపడుతుంటే అడ్డుకుంటుండటం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాము ఆర్థిక వనరుల కొరత ఉన్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అటు బీఆర్‌ఎస్ను, ఇటు బీజేపీని రెండింటినీ ఓడించి తీరుతామని చెప్పారు. తెలంగాణలో ఉన్న సంప్రదాయం ప్రకారం.. ప్రజలు తనకు 2024 నుంచి 2034 వరకు అవకాశం ఇస్తారని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేశ్‌ షెట్కార్‌, రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత రోహిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు గుంటూరుకు సీఎం రేవంత్‌

సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ కుమార్తె వివాహం గుంటూరులో జరగనుంది. ఈ వివాహానికి సీఎం హాజరుకానున్నారు. ఉదయం గుంటూరు వెళ్లనున్న సీఎం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌ చేరుకుని శాసనసభ సమావేశాల్లో పాల్గొంటారు.

Updated Date - Mar 25 , 2026 | 06:08 AM