చర్లపల్లి సూసైడ్ కేసు.. యూట్యూబ్ ఛానల్స్‌కు చిరంజీవి రెడ్డి హెచ్చరిక
ABN , Publish Date - Feb 07 , 2026 | 01:04 PM
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి ఆత్మహత్య కేసుపై సోదరుడు చిరంజీవి రెడ్డి స్పందించారు. పలు యూట్యూబ్ ఛానల్స్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి ఆత్మహత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసుపై మృతురాలి సోదరుడు చిరంజీవి రెడ్డి స్పందించారు. యూట్యూబ్ ఛానల్స్ తమ ఇష్టానుసారంగా థంబ్‌నెయిల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరి మరణానికి తాము కారణం కాదని, కుటుంబ సభ్యులంతా ప్రేమతో ఉండేవారమని ఆయన వివరించారు.
‘మా చెల్లి మరణానికి మేము ఎలా కారణం అవుతాం? మేము.. మా చెల్లి విజయను, వారి పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్లం. అల్లుడు, కోడలు నా చేతుల మీదుగా పెరిగారు. మాకు ఎలాంటి రహస్యాలూ లేవు. నా తల్లికి, నాకు ఏదో రహస్యం తెలుసని ప్రచారం చేయడం సరికాదు’ అని ఆయన అన్నారు. తమ కుటుంబంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న కొన్ని ఛానల్స్‌పై పరువు నష్టం దావా వేస్తామని చిరంజీవి రెడ్డి హెచ్చరించారు. మమ్మల్ని మానసికంగా బాధపెట్టే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని, ఇలాంటి ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సమాజానికి మేలుచేసే వార్తలు ఎన్నో ఉన్నాయని, అలాంటి వాటిని ప్రచురించాలని విజయశాంతి రెడ్డి సోదరుడు సూచించారు. బాధలో ఉన్న తామూ భాదితులమేనన్నారు. ఒక ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతో కక్షపూరితంగా తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో వార్తలు ప్రచురిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీస్ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, పోలీసులు ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేస్తున్నారని చిరంజీవి రెడ్డి తెలిపారు.
కాగా... విజయశాంతి రెడ్డి, తన ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో అసలు నిజాన్ని బయటపెట్టారు పోలీసులు. డిప్రెషన్ కారణంగానే విజయ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించే పిల్లలు.. ఆమెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..
విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసు.. అసలు నిజాన్ని బయటపెట్టిన పోలీసులు..
Read Latest Telangana News And Telugu News