సికింద్రాబాద్‌లో అండాల అక్రమ సేకరణ గుట్టురట్టు.. అదుపులోకి 10 మంది యువతులు
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:52 PM
హైదరాబాద్‌లోని బేగంపేటలో యువతుల అండాల సేకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన యువతుల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్నట్లు బేగంపేట పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ప్రకాశ్ నగర్‌లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌పై ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
సికింద్రాబాద్: బేగంపేటలో యువతుల అండాల సేకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన యువతుల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్నట్లు బేగంపేట పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ప్రకాశ్ నగర్‌లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌పై ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అమీ నీతా గర్ల్స్ హాస్టల్ పేరుతో గత ఏడాది కాలంగా అక్రమ అండాల సేకరణ వ్యవహారం నడుస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
అనంతరం అక్కడ ఉన్న బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 8 నుంచి 10 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఓ మహిళ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మల్కాజిగిరి సీపీ సుమతి ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. సంతాన సాఫల్య కేంద్రాలకు యువతుల అండాలను సరఫరా చేస్తున్నారా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే, అండాల అక్రమ సేకరణ, విక్రయాల వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ ప్రభుత్వానికి మందు చూపు తప్ప ముందు చూపు లేదు: రఘునందన్ రావు
సైబరాబాద్‌లో త్వరలో వన్ వే ట్రాఫిక్ విధానం