ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యంటే నమ్మేదెలా: బండి సంజయ్
ABN , Publish Date - Aug 25 , 2026 | 03:56 PM
కాంగ్రెస్ సర్కార్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదని.. విదేశీ విద్యను అందిస్తానంటే నమ్మేదెలా అని ప్రశ్నించారు.
హైదరాబాద్, ఆగస్టు 25: కాంగ్రెస్ సర్కార్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదని.. విదేశీ విద్యను అందిస్తానంటే నమ్మేదెలా అని ప్రశ్నించారు. ఫీజు బకాయిలు అందక ఉన్న కాలేజీలే మూత పడుతున్నాయని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను రప్పిస్తాననడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. లక్షలాది మంది విద్యార్థులు పడుతున్న మానసిక క్షోభ సీఎంకు పట్టదా అని నిలదీశారు.
‘సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు.. విద్యార్థులకు చేస్తున్న అవమానాలు కనిపించడం లేదా? ఫీజు బకాయిలు అడిగితే కాలేజీ యాజమాన్యాలను బెదరించడం తప్ప కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమిటి? ఫీజు రీయింబర్స్ బకాయిల వల్ల దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నా పట్టదా? ఇందిరమ్మ రాజ్యమంటే దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు ఉన్నత విద్యకు దూరం చేయడమేనా? వన్ టైం సెటిల్‌మెంట్ కింద బకాయిలన్నీ చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది?’ అంటూ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
హామీలిచ్చి మోసం చేయడంలో బీఆర్ఎస్ సర్కార్‌ను మించిపోతున్నారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. తక్షణమే రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే బీజేపీ స్టేట్ చీఫ్ రాంచంద్రరావు ‘ఫీజు బకాయి- బీజేపీ లడాయి’ దీక్ష చేపట్టారని చెబుతూ.. ఆయన ‘దీక్ష’కు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దీక్షకు మద్దుతుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారన్నారు. రాంచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేదాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ-యూకే కీలక ఒప్పందం.. అమరావతి వేదికగా ఎంఓయూపై సంతకాలు
అన్నీ తెలిసే నా గొంతు కోశారు.. జోగి రమేశ్ కోడలి కన్నీటి పర్యంతం
Read Latest AP News And Telugu News