తెలుగు రాష్ట్రాల్లో మారిన బక్రీద్ పండుగ తేదీ.. సెలవు ఎప్పుడంటే?
ABN , Publish Date - May 23 , 2026 | 06:05 PM
తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ హాలీడే తేదీ మారింది. దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో మే 27న కాకుండా మే 28న హాలిడేగా ప్రకటిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్(ఈద్ అల్-అధా) పండుగ తేదీ మారింది. దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో మే 28న బక్రీద్ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేశాయి. దీంతో ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ఉండనుంది. అయితే.. చంద్రుని దర్శనం ఆధారంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో మాత్రం ఈ నెల 27న(బుధవారం) ఈ పండుగను జరుపుకోనున్నారు.
తొలుత ప్రకటించిన దాని ప్రకారం.. మే 27న ఉండగా, దానిని మే 28(గురువారం) నాటికి మారుస్తూ ఇరు తెలుగు రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీచేశాయి. వాస్తవానికి ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ బక్రీద్.. ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన దుల్-హిజ్జా 10వ రోజు వస్తుంది. ఆ ప్రకారం ముస్లిం పండుగలు చంద్రదర్శనంపై ఆధారపడి ఉంటాయి. అయితే.. ఈసారి దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఒకరోజు ఆలస్యం కావడంతో పండుగ తేదీ మారినట్టు మతపెద్దలు ప్రకటించారు.
తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం పండుగ సెలవును 28కి మార్చింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రూమెంట్స్ యాక్ట్ 1881(NI Act) ప్రకారం.. మే 28న సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. మే 28న సెలవు ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీచేసింది.
ఇవీ చదవండి:
కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..
మరణానికి ముందు సెలూన్‌ను సందర్శించిన ట్విషా.. యజమాని సంచలన ఆరోపణలు