75.34శాతం ఉత్తీర్ణత
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:35 AM
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ సంవత్సరం 70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 75.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 66.20 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతమిది
గత మూడేళ్లలో ఇదే అత్యధికం
ప్రథమ సంవత్సరంలో 66.20 శాతం విద్యార్థులు పాస్
ఫలితాలు విడుదలచేసిన ప్రభుత్వ సలహాదారు కేకే
నేటి నుంచి రీవాల్యుయేషన్ దరఖాస్తుల స్వీకరణ
మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ సంవత్సరం 70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 75.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 66.20 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో గత మూడేళ్లలో ఇదే అత్యధిక శాతం ఉత్తీర్ణత కావటం గమనార్హం. ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,89,123 మంది హాజరు కాగా, 3,23,806 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,53,932 మంది హాజరుకాగా, 3,41,984 మంది పాసయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఆదివారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదలచేశారు. ఈసారి ఇంటర్ ఫలితాల్లో బాలుర ఉత్తీర్ణత శాతం తగ్గగా, బాలికలు అత్యధికంగా పాసయ్యారు. మొత్తం 33 జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరంలో 74.74 శాతం, ద్వితీయ సంవత్సరంలో 80.67 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. బైపీసీలో ప్రథమ సంవత్సరంలో 70.11 శాతం, ద్వితీయ సంవత్సరంలో 75.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీఈసీలో ఫస్టియర్‌లో 41.76 శాతం, సెకండియర్‌లో 49.43 శాతం ఉత్తీర్ణులయ్యారు.
మే-13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ఇంటర్ బోర్డు ఆదివారం ప్రకటించింది. మే-13 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమై అదే నెల 21న ముగియనున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ద్వితీయ సంవత్సరం మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5-30 వరకు ఉంటాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి 25 వరకు రోజుకు రెండు పూటలు ఉంటాయి. ఈ పరీక్షల కోసం ఫీజును ఈ నెల 13 నుంచి 20 వరకు సంబంధిత కాలేజీల్లో మాత్రమే చెల్లించాలని, ఆన్‌లైన్లో స్వీకరించబోమని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
నేటి నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్..
పరీక్ష పేపర్లలో మార్కుల రీకౌంటింగ్‌తోపాటు సమాధాన పత్రం స్కాన్ కాపీ, రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 13 నుంచి 20 వరకు ఆన్‌లైన్లో దరకాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీవెరిఫికేషన్, స్కాన్డ్ కాపీల కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.800 చొప్పున చెల్లించాలి.

కష్టాలకు ఎదురీది..
కీసర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కర్వేద రాంచరణ్‌రెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో వెయ్యికి 994 మార్కులు సాధించాడు. రాంచరణ్‌రెడ్డి చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో కీసర మండలం గోధుమకుంట గ్రామంలోని తన తాతయ్య ఇంటి వద్ద ఉంటూకీసరలోని ప్రభుత్వ పాఠశాలలో 8నుంచి 10వ తరగతి వరకు చదివాడు. పదో తరగతిలో 10/10 ఉత్తీర్ణత సాధించి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. రాంచరణ్‌రెడ్డి ప్రతిభను గుర్తించిన కీసర ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు.. అతడిని హయత్‌నగర్‌లోని భవిష్య కళాశాలలో చేర్పించి పుస్తకాలు, ఇతర ఖర్చులు, బాగోగులు కూడా ఆయనే చూసుకున్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుతా..
కొత్తగూడెం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ నలంద జూనియర్ కళాశాల విద్యార్థి పి. చరణ్ ఎంపీసీ గ్రూప్‌లో 469/470 (హాల్‌టికెట్ నెం. 2644100829) మార్కులు సాధించి సత్తా చాటాడు. ఇతడికి సంస్కృతం సబ్జెక్టులో ఒక మార్కు తగ్గడంతో 470 మార్కులకు గాను 469 సాధించాడు. మిగతా సబ్జెక్టులలోనూ వందకు వంద శాతం మార్కులు సాధించాడు. భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతానని చరణ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాడు.

ఆటో డ్రైవర్ కూతురికి 994 మార్కులు
ఖమ్మం ఖానాపురంహవేలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఆటో డ్రైవర్ కూతురు గుంటి ప్రహర్ష ఇంట ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో వెయ్యికి 994 మార్కులు సాధించింది. ఆమె తండ్రి నాలుగు నెలల క్రితమే మృతి చెందాడు. దీంతో తల్లి కూలి పనులు చేస్తూ కూతురిని ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో చదివించింది. డాక్టర్ కావటమే తన లక్ష్యమని ప్రహర్ష ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపింది.