వచ్చే నైరుతిపై ఆశలు
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:33 AM
దేశ రైతాంగానికి ఊరటనిచ్చే వాతావరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు వచ్చే ఏడాది మార్చి తర్వాత బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.
2027 మార్చి వరకు శక్తిమంతంగా ఎల్‌నినో
ఆ తర్వాత జూన్ నాటికి లానినా సంకేతాలు
2027 నైరుతిలో సమృద్ధిగా వర్షాలుంటాయని అంచనాలు
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): దేశ రైతాంగానికి ఊరటనిచ్చే వాతావరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు వచ్చే ఏడాది మార్చి తర్వాత బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్పటి నుంచచి లానినా పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో 2027 నైరుతి రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్‌కాయిస్) శాస్త్రవేత్తలు తెలిపారు. ఎల్‌నినో వల్ల వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడితే.. లానినా వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఇన్‌కాయిస్ అంచనా ప్రకారం ప్రస్తుత నవంబరు నెల నుంచి 2027 మార్చి వరకు ఎల్‌నినో కొనసాగడానికి 87 నుంచి 100 శాతం అవకాశముంది. అయితే, ఈ ఏడాది డిసెంబరు తర్వాత దీని తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
2027 ఏప్రిల్-జూన్ మధ్య తటస్థ వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని,జూన్- ఆగస్టు మధ్య లానినా పరిస్థితులు ఏర్పడవచ్చని ఇన్‌కాయిస్ వెల్లడించింది. ఎల్‌నినో, లానినా పరిస్థితులను ట్రాక్ చేసే ‘నినో 3.4 సూచిక’ పరిణామ క్రమాన్ని అంచనా వేయడానికి ఈ సంస్థ ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మోడల్‌ను అభివృద్ధి చేసింది. గత నెలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసం (నినో 3.4 ఇండెక్స్) సుమారు 3 డిగ్రీల సెల్సియ్‌సకు చేరింది. సముద్ర అంతర్భాగంలోనూ సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడం బలమైన్ ఎల్‌నినోకు నిదర్శనమని ఆ సంస్థ పేర్కొంది. అయితే, మనదేశంలో వర్షపాతం కేవలం ఎల్‌నినో, లానినాలపై ఆధారపడి ఉండదని తెలిపింది. హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ ఓషన్ డైపోల్, మాడెన్-జూలియన్ అసిలేషన్, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల దిశ, వేగం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని వెల్లడించింది. కాగా, లానినా పరిస్థితులు ఏర్పడుతాయని ఇప్పుడే అంచనా వేయలేమని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అభిప్రాయపడ్డారు.
మార్చి తర్వాతే పూర్తి స్పష్టత
ప్రస్తుతం సూపర్ ఎల్‌నినో పరిస్థితులున్నాయి. వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నది. మరో నెల తర్వాత ఇది మరింత తీవ్రతరం అవుతుంది. ఈ పరిస్థితి పూర్తిగా మారి లానినా రావాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం లానినాకు తక్కువ అవకాశాలున్నాయి. మార్చి తర్వాత దీనిపై పూర్తిగా స్పష్టత వస్తుంది.
- బాలాజీ, తెలంగాణ వెదర్ మ్యాన్
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక