నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం
ABN , Publish Date - Aug 20 , 2026 | 09:32 PM
ఇకపై హైదరాబాద్‌లో చలానాల నుంచి తప్పించుకోవాలని నంబర్ ప్లేట్లతో ఆటలాడితే కుదరదు. నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 20: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా రక రకాల జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. నంబర్ ప్లేట్లను మార్చడం, స్పష్టంగా కనిపించకుండా చేయడం, నిబంధనలకు విరుద్ధమైన ప్లేట్లను ఏర్పాటు చేసుకోవడం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. వారం రోజుల్లోనే నకిలీ నంబర్ ప్లేట్లకు సంబంధించి ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించేలా, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
వాహనాలకు ప్రభుత్వం ఆమోదించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లనే (HSRP) అమర్చుకోవాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లను మార్చడం, వక్రీకరించడం లేదా చలానాల నుంచి తప్పించుకునే ఉద్దేశంతో వాటిని దాచడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. నంబర్ ప్లేట్లపై ప్రత్యేక తనిఖీలు మరింత తీవ్రంగా కొనసాగుతాయని జాయింట్ సీపీ వెల్లడించారు. వాహనదారులు నిబంధనలను పాటిస్తూ తమ వాహనాలకు సరైన నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికత, కెమెరాల ద్వారా నంబర్ ప్లేట్లను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎస్‌సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక
సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్
Read Latest AP News And Telugu News