హైదరాబాద్‌లో ఉద్రిక్తత.. మినిస్టర్స్ కాలనీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:02 PM
హైదరాబాద్‌లోని మినిస్టర్స్ కాలనీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, జులై 10: నగరంలోని మినిస్టర్స్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు యత్నించారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ముందస్తు సమాచారం మేరకు భారీగా పోలీసులు అక్కడ మోహరించి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు.
మినిస్టర్స్ క్వార్టర్స్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించి పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్లకు తరలించగా, మినిస్టర్స్ కాలనీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, విద్యార్థి సంఘాల తదుపరి కార్యాచరణపై పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్
Read Latest Telangana News And Telugu News